జాలర్ల చర్చలు షురూ

3 Mar, 2014 23:37 IST|Sakshi
జాలర్ల చర్చలు షురూ

కొలంబో వేదికగా 13న ఖరారు
 శుభ పరిణామం అన్న స్వామి
 
 సాక్షి, చెన్నై:
 శ్రీలంక-తమిళ జాలర్ల మధ్య మళ్లీ భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 13న మలివిడత చర్చలకు నిర్ణయించారు. శ్రీలం క రాజధాని కొలంబో వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళుతున్న రాష్ట్ర జాలర్లకు భద్రత కరువు అవుతోంది. జాలర్లపై  శ్రీలంక నావికాదళం ప్రదర్శిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడి చేసి పట్టుకెళ్లి కారాగారాల్లో నెలల తరబడి ఉంచుతున్నారు. పడవలను స్వాధీనం చేసుకుని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని జాలర్లలో ఆందోళన, ఆగ్రహావేశాలను రగుల్చుతోంది. రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చలకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కేంద్రంపై విజయవంతం అయ్యాయి. అయితే, చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు మాత్రం గోప్యంగా ఉంచారు. రెండు దేశాల జాలర్ల ప్రతినిధులు చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసినా, శ్రీలంక నావికాదళం మాత్రం వెనక్కు తగడం లేదు. రాష్ట్ర జాలర్లపై తన ప్రతాపాన్ని చూపుతూనే వస్తోంది. ఇప్పటి వరకు 121 మంది ఆ దేశ చెరలో బందీలుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మలి విడత చర్చల ద్వారా త్వరితగతిన రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావారణం సృష్టించాలన్న డిమాండ్‌తో రాజకీయ పక్షాలు గళం విప్పాయి.
 
 మళ్లీ చర్చలు: కేంద్రం మీద ఒత్తిడి పెరగడంతో చర్చలకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు చేపట్టింది. గత నెల చివర్లో చర్చలకు ఏర్పాట్లు జరిగినా, అనివార్య కారణాలతో తేదీని నిర్ణయించలేదు. ఎట్టకేలకు చర్చలకు ముహూర్తం కుదిరింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలకు శ్రీలంక ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. తమిళుల డిమాండ్లకు తలొగ్గిన ఆ దేశ ప్రభుత్వం, కొన్ని మెలికలతో కూడిన కొత్త అంశాలను తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. వీటన్నింటిపై చర్చించి, రెండు దేశాల మధ్య సఖ్యత లక్ష్యంగా తుది నిర్ణయానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13న మలి విడతగా రెండు దేశాల జాలర్ల మధ్య చర్చలకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం తెలియజేసింది. దీంతో చర్చలకు రాష్ట్ర జాలర్ల ప్రతినిధులు సిద్ధం అవుతున్నారు.

 


 అదే కమిటీ: ఇది వరకు చెన్నై వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న కమిటీని కొలంబోకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం, కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో జాలర్ల ప్రతినిధులు మరికొద్ది రోజుల్లో కొలంబోకు పయనం కానున్నారు. కొలంబోకు బయలు దేరుతున్న వారిలో నాగపట్నంకు చెందిన శివజ్ఞానం, వీర ముత్తు, చిత్రా వేలు, జగన్నాథన్, తంజావూరుకు చెందిన వి రాజమాణిక్యం, పుదుకోట్టైకు చెందిన కుట్టి యాండి, జి రామకృష్ణన్, రామనాధపురానికి చెందిన పీ జేసు రాజ్, అరులానందం, ఎంఎస్ అరుల్, ఎన్ దేవదాసులు, రాయప్పన్ ఉన్నారు. అలాగే, పుదుచ్చేరికి చెందిన ఇళంగోవన్ నేతృత్వంలో అక్కడి జాలర్ల సంఘాల ప్రతినిధులు శ్రీలంక జాలర్లతో చర్చలకు బయలు దేరనున్నారు.
 
  ఈ చర్చలు సత్ఫలితాల్ని ఇవ్వడం ఖాయం అని, తద్వారా అన్ని సమస్యలు సర్దుకుంటాయని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఉదయం మీనంబాక్కం విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కొలంబో వేదికగా తుది విడత చర్చ జరగబోతోందన్నారు. రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావరణం సృష్టించే రీతిలో జాలర్ల చర్చలు సాగబోతున్నాయని, అనేక ఒప్పందాలు కుదరబోతున్నాయని వివరించారు. ఈ చర్చలు రెండు దేశాల జాలర్లకు శుభ పరిణామం అని, ఇక దాడులకు అడ్డుకట్ట వేసినట్టేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు