తీరుమార్చుకోని శ్రీలంక దళాలు

27 Aug, 2013 03:47 IST|Sakshi
తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు మరోమారు విరుచుకుపడ్డాయి. వలలు తెంచేసి విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేగాక 32 మంది జాలర్లను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. శ్రీలంక తీరు పట్ల జాలర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు-శ్రీలంక మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే పరిస్థితులు రెండేళ్లుగా నెలకొన్నాయి. శ్రీలంకలో యుద్ధం పేరిట సాగిన మారణహోమం పట్ల తమిళులు ఆగ్రహంగా ఉన్నారు. తమిళనాడుకు శ్రీలంక దేశాధ్యక్షుడి నుంచి సాధారణ పౌరులు వచ్చినా స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. వీరు భారతదేశంలోనే అడుగుపెట్టడానికి వీల్లేదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. శ్రీలంక సముద్రతీరంలోని కచ్చదీవులపై తమిళనాడుకు సైతం హక్కుందనే వివాదం కొనసాగుతోంది. 
 
కచ్చదీవుల స్వాధీనంపై గతంలోని ఒప్పందాన్ని ఉపసంహరించుకుని పూర్తిగా భారత్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరోవైపు తమిళ జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు తరచూ విరుచుకుపడుతున్నాయి. రామేశ్వరం, జగదాపట్టినకు చెందిన 106 మంది జాలర్లను తమ జైళ్లలో బంధించారు. వారిని విడుదల చేయాలంటూ ఎన్నో రోజులుగా కేంద్రం శ్రీలంకను కోరుతోంది.
 
మరో 32 మందికి చెర పాంబన్ సముద్రతీర సమీపంలోని జాలర్లు విల్సన్, మచ్చినాథన్, కొలంబస్ తదితరులు 32 మంది నాలుగు బోట్లలో సోమవారం ఉదయూన్నే వేటకు వెళ్లారు. మన్నార్‌కుడి ప్రాంతంలో చేపల వేట సాగిస్తుండగా అకస్మాత్తుగా శ్రీలంక దళాలు చుట్టుముట్టారు. వచ్చీరాగానే దాడికి దిగారు. వలలను తెంచేశారు. జాలర్లను ఇష్టానుసారం చితకబాదారు. మొత్తం 32 మందిని తమ దేశంలోని జైళ్లకు తరలించారు. తమ పరిధిలోని ప్రాంతంలో వేట సాగిస్తుండడంతోనే జాలర్లను అరెస్ట్ చేశామని శ్రీలంక సమర్థించుకుంది. జాలర్ల అరెస్ట్‌తో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమవారిని వెంటనే విడిపించేందుకు చొరవ తీసుకోవాలని జాలర్ల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
మరిన్ని వార్తలు