ఆగిన కూత

30 Aug, 2017 08:34 IST|Sakshi
ఆగిన కూత

రైల్వే పథకాలకు బ్రేక్‌
13 మార్గాల పనులు నిలుపుదల
ఒప్పందాలకు తమిళ సర్కారు దూరం
ఆ మార్గాల్లో ఆదాయం శూన్యం అన్న రైల్వే


రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైల్వే పథకాలు అనేకం ఆగే పరిస్థితికి వచ్చాయి. ప్రధానంగా 13 రైల్వే మార్గాల పనుల్ని నిలుపుదల చేయడానికి రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఆ మార్గాల్లో ఆదాయం శూన్యమే అన్న విషయాన్ని పరిగణించడంతో పాటు, పనులకు తగ్గ ఒప్పందాల విషయంలో తమిళ ప్రభుత్వ సహకారం కొరవడంతో బ్రేక్‌ వేయడానికి రైల్వే యంత్రాంగం చర్యలు చేపట్టింది.

సాక్షి, చెన్నై :  ఆదాయం లేదనే కారణంతో గత ఐదారేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పలు పథకాలు ప్రస్తుతం వెనక్కి వెళ్లనున్నాయి. దక్షిణ రైల్వేకి ఆదాయం మెండుగా ఉన్నా, అందుకు తగ్గ కొత్త పథకాల మీద కేంద్రం సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. ప్రతి ఏటా బడ్జెట్‌లో మమా.. అనిపించే విధంగా రైళ్లు, కొత్త మార్గాల పనుల్ని ప్రకటిస్తూ వస్తోంది. అయితే, అవి అమల్లోకి వచ్చేదెన్నడో అన్న ప్రశ్న బయలుదేరక మానదు. ఇందుకు కారణం నిధుల కేటాయింపులు నామమాత్రంగానే ఉండడం.

ఏడాదికి ఒకటి రెండు చొప్పున పథకాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా, కేంద్ర రైల్వే యంత్రాంగంతో కలిసి ముందుకు సాగడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతోంది. గత ఐదారేళ్లలో రాష్ట్రానికి వచ్చిన 13 పథకాలు ప్రస్తుతం వెనక్కి వెళ్లనున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వ సహకారం కొరవడడమే. అలాగే, ఆ మార్గాల్లో పనులు చేపట్టినా, రైళ్లు నడిపినా ఆదాయం శూన్యమే అన్న విషయాన్ని కేంద్ర రైల్వేయంత్రాంగం తేల్చి ఉండడం గమనించాల్సిన విషయం.

రూ.9500 కోట్ల పథకాలకు బ్రేక్‌
2011లో అన్నాడీఎంకే సర్కారు రాష్ట్రంలో అధికార పగ్గాల్ని చేపట్టింది. రెండోసారిగా ఆ పాలన ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఐదారేళ్ల  కాలంలో ఏడాదికి ఒకటి రెండు చొప్పున పథకాలను బడ్జెట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ కేటాయించింది.  చెన్నై, కాంచీపురం, మదురై, తంజావూరు,  కారైక్కుడి , దిండుగల్, పుదుకోట్టై వైపుగా కొత్త రైల్వే మార్గాలను ప్రకటించారు. ఇందుకు తగ్గ ప్రారంభ పనుల మీద అధికార వర్గాలు దృష్టి పెట్టి, అంచనా వ్యయాన్ని రూపొందించాయి. ఆ మేరకు రూ.915 కోట్లతో సైదా పేట నుంచి శ్రీ పెరంబదూరు మీదుగా, రూ.1810 కోట్లతో తిరువణ్ణామలై నుంచి కాంచీపురం మీదుగా కాట్పాడికి, రూ.650 కోట్లతో మేలూరు నుంచి కారైక్కుడి వైపుగా, నైజ 1314 కోట్లతో  కారైక్కుడి–దిండుగల్, రూ.1009 కోట్లతో కుంబకోణం–విరుదాచలం వైపుగా కొత్త మార్గాలకు ప్రణాళిక సిద్ధం చేశారు.

అదే సమయంలో ఈ మార్గాల్లో పెట్టుబడి పెట్టిన పక్షంలో ఆదాయం ఏమేరకు ఉంటుందో అనే పరిశీలనను సైతం కేంద్రం రైల్వే యంత్రాంగం సాగించింది. ఆదాయం అంతంత మాత్రమే అనేది తొలుత తేలినా, తదుపరి పరిశీలనలో శూన్యమేనన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పనులకు తగ్గ ఒప్పందాల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైల్వే యంత్రాంగం తమ జాగ్రత్తల్లో పడింది. స్థల సేకరణ, తమిళనాడు సగం వాటా నిధులు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా, ఇక్కడి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేని దృష్ట్యా, ఆ పథకాల్ని నిలుపుదల చేయడానికి రైల్వేవర్గాలు సిద్ధం అయ్యాయి.

తమిళనాడు ప్రభుత్వ సహకారం లేనందున పనుల్ని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని, మరోవైపు ఆ మార్గాల్లో రైల్వేకు ఆదాయం శూన్యమేని తేలడంతో పథకాలకు బ్రేక్‌ వేస్తూ కేంద్ర రైల్వే యంత్రాంగానికి నివేదిక పంపినట్టు ఇక్కడి రైల్వే వర్గాలు పేర్కొనడం గమనార్హం. కొన్ని రైల్వే మార్గాల ద్వారా ఆదాయం మెండుగా ఉన్నా, మరికొన్ని మార్గాల్లో నష్టం తప్పడం లేదని అధికారులు వివరించారు. 14 శాతం ఆదాయం ఉన్న పక్షంలో కొత్త మార్గాల్ని చేపట్టేందుకు వీలుందని, లేనిపక్షంలో నష్టం తప్పదంటున్నారు. ఇటీవల తిరువనంతపురం–కన్యాకుమారి మధ్య సిద్ధం చేసిన రైల్వేమార్గం ద్వారా ఆదాయం 2 శాతం మేరకే ఉందనే విషయాన్ని పరిగణించాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో రూ.9,500 కోట్లతో కూడిన 13 పథకాలు తమిళనాడులో ఆగినట్టేనని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు