ఎట్టకేలకు మెరీనా తీరంలోనే.. 

9 Aug, 2018 03:57 IST|Sakshi
కరుణానిధిని చివరి చూపు చూస్తూ కన్నీటిపర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కలైంజర్‌ కరుణానిధి అంతిమ సంస్కారాలు, సమాధి ఎక్కడనే వివాదానికి తెరపడింది. ఈ సందర్భంగా అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష డీఎంకే మధ్య హైడ్రామా నడిచింది. ఇరుపక్షాల వాదోపవాదాల అనంతరం చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కనే స్థలం కేటాయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. మెరీనా బీచ్‌లో కరుణ అంతిమ సంస్కారాలకు స్థలం కేటాయించాల్సిందిగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ మంగళవారం చేసిన వినతిని తమిళనాడు ప్రభుత్వం మొదట తిరస్కరించిన విషయం తెలిసిందే.

బీచ్‌ తీరంలో సమాధులపై మద్రాసు హైకోర్టులో కేసులు, తద్వారా చట్టపరమైన చిక్కులు ఉన్నందున చెన్నై గిండీలోని గాంధీ మండపం పక్కనే రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అయితే ఇందుకు డీఎంకే సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి చేత మంగళవారం రాత్రి 9.20 గంటలకు మద్రాసు హైకోర్టు ఇన్‌చార్జ్‌ ప్రధాన న్యాయమూర్తి కే.రమేష్, న్యాయమూర్తి సుందర్‌ సమక్షంలో స్టాలిన్‌ అత్యవసర పిటిషన్‌ దాఖలు చేయించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.  

అభ్యంతర పిటిషన్లు వెనక్కు..: బీచ్‌లో సమాధులపై తాను వేసిన నాలుగు పిటిషన్లను కరుణ కోసం వెనక్కు తీసుకునేందుకు సిద్ధమని సీనియర్‌ న్యాయవాది దురైస్వామి ప్రకటించారు. అలాగే పీఎంకే నేత వేసిన పిటిషన్‌ సైతం ఉపసంహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో స్టాలిన్‌ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు మంగళవారం రాత్రి 10.30 గంటలకు విచారణ ప్రారంభించారు. ఈ వివాదంపై బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు విచారణ జరిపి ఉదయం 8 గంటలకు వాయిదా వేశారు. . అభ్యంతర పిటిషన్లు అన్నింటినీ ఉపసంహరించిన కారణంగా మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి అనుమతిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులిచ్చింది. 

కన్నీటి పర్యంతమైన స్టాలిన్‌
మెరీనాబీచ్‌లో కరుణ సమాధికి కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియగానే.. రాజాజీ హాల్‌లో కరుణ పార్థివదేహం పక్కన నిల్చుని ఉన్న స్టాలిన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న దురైమురుగన్, కనిమొళి తదితర నేతలు స్టాలిన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నాదురై సమాధి పక్కనే కరుణ సమాధికి అనుమతి వచ్చినట్లు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ మైకులో ప్రకటించడంతో కార్యకర్తలు, ప్రజలు శాంతించారు.  

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా