కాబోయే సీఎం కుష్బు

25 Mar, 2015 03:37 IST|Sakshi
కాబోయే సీఎం కుష్బు

సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో కుష్బు సెలబ్రెటీ అయ్యారు. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను ప్రకటించిన వెంటనే నాయకులు పలాన పదవికి అంటే, పలాన పదవికి ఆమె అర్హురాలు అని ఊకదంపుడు ప్రసంగాలతో పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. నిన్న మొన్నటి పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కుష్బును మంత్రిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడ్డా కుష్బు మంత్రి కావడం తథ్యమని ప్రకటించేశారు. ఈ ప్రకటన వినడానికి బాగానే ఉన్నా, కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు మాత్రం  కారాలు మిరియాలు నూరే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుచ్చి వేదికగా జరిగిన నిరసన సభలో ఏకంగా అక్కడి నాయకులు కాబోయే సీఎం కుష్బు అని నినదిస్తూ, సీఎం పదవికి ఆమె అర్హు రాలిగా ప్రకటిస్తూ నినాదాలు హోరెత్తించడం గమనార్హం.
 
  భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా, ఆ చట్టాన్ని మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే సర్కారు వైఖరిని ఎండగడుతూ తిరుచ్చిలోని అన్నా విగ్రహం వేదికగా సోమవా రం సాయంత్రం నిరసన సభ జరిగింది. ఈ నిరసనకు కుష్బు నేతృత్వం వహించా రు. ఇందులో ప్రసంగించిన ఆ జిల్లా పార్టీ నాయకులు ఆరోగ్య రాజ్, వేలు స్వామి తదితరులు కుష్బును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మద్దతు దారులకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. అదే సమయంలో చిదంబరానికి మద్దతు గా నినాదాలు  అందుకోవడం, మరి కొం దరు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో నిరసనలో గందరగోళం చోటు చేసుకుంది. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా చిదంబరం వర్గీయులు నినాదాలు చేయడంతో తామింతే అన్నట్టుగా గ్రూపు తగదా రాజుకుంది. చివరకు పోలీ సులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది.
 
 అనంతరం నిరసనను ఉద్దేశించి కుష్బు ప్రసంగిస్తూ, కేసుల నుంచి బయట పడేందుకే భూ సేకరణ చట్టానికి అన్నాడీఎంకే మద్దతు ప్రకటిం చిందని ఆరోపించారు. కేంద్రం తీరును ఎండగట్టే రీతిలో ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనూ కుష్బు సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. తర్వాత మీడియా కుష్బు ను కదలించింది. తమరిని కాబోయే సీఎంగా పేర్కొంటున్నారే, ఆ పదవికీ తమరు అన్ని రకాల అర్హులుగా వ్యాఖ్యానిస్తున్నారని గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకు అవకాశం ఉందని, ఎవరికి వారు తమ అభిప్రాయాలతో కూడిన ప్రసంగాలు చేస్తుంటారని, వాటన్నింటినీ పరిగణించాల్సిన అవసరం లేదని ముందుకు సాగారు.
 
 కుష్బుకు హోదా: ఇన్నాళ్లు ఎలాంటి పదవి లేకుండా తన సేవల్ని పార్టీకి అందిస్తూ వచ్చిన నటి కుష్బును కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. కుష్బు వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఆమెను ఏఐసీసీలో అందలం ఎక్కించేలా చేసిందని చెప్పవచ్చు. సమస్యలపై స్పందించే విధానం, సందర్భోచితంగా వ్యాఖ్యలు చేయడం, రాజకీయ అవగాహన వెరసి కుష్బుకు ఏఐసీసీలో చోటు దక్కేలా చేశాయి. ఆమెకు అధికార ప్రతినిధి హోదాను కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. 17 మంది ఏఐసీసీ అధికార ప్రతినిధుల జాబితాలో కుష్బుకు ఆరో స్థానం దక్కడం విశేషం. జాతీయ అధికార ప్రతినిధిగా తమిళనాడుకు చెంది న కుష్బు పేరును మంగళవారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. కుష్బుకు పదవి దక్కడంతో పార్టీలో దూసుకెళ్లడం ఖాయం. ఆమెకు మద్దతు దారుల సంఖ్య పెరగడం ఖాయం. అదే సమయంలో కొత్త నినాదం మరింతగా ప్రచారంలోకి రానుండడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు