రాష్ట్రంలో నీటి కటకట

11 May, 2015 23:47 IST|Sakshi

- గతేడాదితో పోల్చితే గణనీయంగా తగ్గిన నిల్వలు
- ఆందోళన చెందుతున్న ముంబై ప్రజలు
- జూలై 31 వరకు సరిపడే నిల్వలున్నాయి: బీఎంసీ
సాక్షి ముంబై:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 శాతం కంటే తక్కువ నీటి నిల్వలు ఉన్నట్లు స్పష్టమైంది. జూన్ మొదటి వారంలో వర్షాలు మొదలవకపోతే పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నీటి నిల్వలు ఘననీయంగా తగ్గాయి. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలు దాటిపోతుండటంతో  నిల్వలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై బీఎంసీ నీటి సరాఫరాల శాఖ చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాంబ్లే మాట్లాడుతూ.. ముంబై నగరానికి నీటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని  పేర్కొన్నారు. నగరానికి నీరు సరాఫరా చేసే జలాశయాల్లో జూలై 31 వరకు సరిపడే నిల్వలు ఉన్నాయని అన్నారు.

ఈ విషయమై నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని చెప్పారు. ప్రస్తుతం బీఎంసీ వద్ద నాలుగు లక్షల మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉందన్నారు. ముంబైకర్లకు ప్రతిరోజు 3,750 ఎమ్మెల్డీల (మిలియన్ లీటర్‌‌స పర్ డే) నీరు అవసరమని, దీన్ని బట్టి నీటి సరఫరాపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని బీఎంసీ అధికారులు తెలిపారు. గతంలో జూన్ చివరి తేదీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాపై అధికారులు ప్రణాళికలు రూపొందించేవారు. కాని సమయానికి వర్షాలు కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల ప్రస్తుతం జులై 31 వ తేదీ వరకు నీటిని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

నగరానికి నీటి సరఫరాచేసే బాత్సా, మోడక్‌సాగర్, మధ్య వైతర్ణ, విహార్, తులసీ, తాన్సా తదితర జలాశయాల్లో ప్రస్తుతం జూలై 31 వరకు సరిపోయే విధంగా నిల్వలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నెల రోజుల ముందు వాతావరణ శాఖ నుంచి వర్షానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి. కాగా, ఈ సారి అనుకున్న సమయానికన్నా ముందే వర్షాలు  కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. అయితే ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే నగరంలో ఎంత శాతం మేర నీటి కోత అమలు చేయాలనే విషయంపై బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.   

మరిన్ని వార్తలు