రోడ్లపై ఉత్సవాలు ఆపండి: హైకోర్టు

29 Aug, 2015 02:20 IST|Sakshi
రోడ్లపై ఉత్సవాలు ఆపండి: హైకోర్టు

ముంబై : గణేశ్ ఉత్సవాలు, దేవీ నవరాత్రులు సందర్భంగా రోడ్లపై మందిరాలు నిర్మించే సంస్థలు, వ్యక్తులపై బాంబే హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వీటన్నిటి కీ తాము వ్యతిరేకమని పేర్కొంది. నగరంలోని బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై గణేశ్, నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఆపాలని సూచించింది. వీటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారని ప్రశ్నించింది. మందిరాలు నిర్మించడానికి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని జస్టిస్ వీఎమ్ కనడే, షాలినీ ఫన్సాల్కర్‌ల ధర్మాసనం పేర్కొంది.

జగన్నాథ రథయాత్రను ఆపాలంటూ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్ (ఐఎస్‌కేసీఓఎన్) దాఖలు చేసిన పిటిషన్, గణేశ్ ఉత్సవాల సందర్భంగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేస్తున్నారన్న పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. లౌడ్ స్పీకర్లు లేకుండా ఉత్సవాలు జరుపుకోవడం కుదరదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. వీటన్నిటికీ తాము వ్యతిరేకమని, నగరంలో ఖాళీ ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. రెండు కేసులపై విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

 ఆ పిటిషన్ కొట్టివేయం
 రాష్ట్రంలోని 15 ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోర్టు చెప్పింది. ఎఫ్‌ఏ ఎంటర్‌ప్రైజెస్, ఎఫ్‌ఏ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని సదరు సంస్థలు కోర్టును కోరాయి. ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించిందని, కాబట్టి మరో దర్యాప్తు అనవసరమని సంస్థల తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ప్రస్తుత పిటిషన్ రాయగఢ్‌లోని కొంధనే డ్యాంకు సంబంధించినది కాదని,15 డ్యాంలకు సంబంధించిందని కోర్టు చెప్పింది., 2012లో పిటిషన్ దాఖలైందని, విచారణ ఇప్పుడు జరుగుతోందని కోర్టు చెప్పింది.

మరిన్ని వార్తలు