సమ్మె ఉధృతం

5 May, 2017 02:14 IST|Sakshi
సమ్మె ఉధృతం

► క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు బంద్‌
► 16వ రోజుకు చేరిన సమ్మె
► త్వరలో తీర్పు: మంత్రి


డిమాండ్ల సాధన కోసం వైద్యులు తలపెట్టిన సమ్మె గురువారం నాటికి ఉధృతం దాల్చింది. వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోగా రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల ఆపరేషన్లు నిలిచిపోయాయి. వైద్యం అందించేవారు లేక రోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: పీజీ కోర్సులో ప్రభుత్వ వైద్యులకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గత నెల 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు సమ్మె జరుపుతున్నారు. గురువారం నాటికి ఈ సమ్మె 16వ రోజుకు చేరుకోగా, ప్రభుత్వ వైద్యులు, హౌస్‌సర్జన్లు, వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములయ్యారు. మానవహారం, ర్యాలీ, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావ డం, క్యాన్సర్‌ రోగులకు చికిత్స నివారణ వంటి నిరసనలు పాటించారు. ఈ డిమాండ్‌కు సంబంధించిన కేసు బుధవారం విచారణకు రాగా, ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాన్ని ప్రకటించారు. దీంతో కేసు త్రిసభ్య కమిటీ బెంచ్‌కు మారింది.

కేసు విచారణలో ఉన్నందున సమ్మెను విరమించాల్సిందిగా వైద్య మంత్రి  విజయకుమార్‌ కోరారు. అయితే తమ డిమాండ్లను సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వైద్యులు ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల మందికి జరగాల్సిన ఆపరేషన్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్‌)లో సగటున రోజుకు ఐదు వేల మంది చికిత్స పొందుతుంటారు. వీరిలో రెండువేల మంది ఇన్‌పేషంట్లుగా ఉంటారు. అవుట్‌ పేషంట్ల సేవలకు పెద్దగా ఇబ్బంది తలెత్తకున్నా ఇన్‌పేషంట్ల ఆపరేషన్లకు మాత్రం తీవ్ర విఘాతం ఏర్పడింది.

అలాగే కీల్‌పాక్, స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గురువారం మరో రెండువేల ఆపరేషన్లు నిలిచిపోయాయి. స్టాన్లీ ఆసుప్రతి వైద్యులు గురువారం నిరాహారదీక్ష చేశారు. విధుల్లో ఉన్న అరకొర వైద్యులను రోగులు నిలదీయగా, వైద్యులు మరో రెండు మూడు రోజుల్లో సమ్మె విరమించగానే ఆపరేషన్లు చేస్తామని ఓదారుస్తున్నారు. అయితే ఈ మాటలకు శాంతించని రోగులు, వారి కుటుంబీకులు వైద్యులతో వాగ్విదానికి దిగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలతోపాటూ చెన్నై కార్పొరేషన్‌ ఆధీనంలోని 150 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు సైతం సమ్మెలో పాల్గొనడంతో జ్వరం తదితర చిన్నపాటి వ్యా«ధిగ్రస్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో అనేక ఆస్పత్రిల్లో నర్సులే వైద్యం చేస్తున్నారు.

త్వరలో మంచి తీర్పు: మంత్రి విజయభాస్కర్‌
పీజీ కోర్సులో ప్రభుత్వ వైద్యులకు 50 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయరాదనే∙కోర్కెపై కోర్టు నుండి మంచి తీర్పు వెలువడగలదని వైద్యమంత్రి విజయభాస్కర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో అమ్మవాటర్‌ పథకాన్ని గురువారం ఆవిష్కరించిన సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పీజీ రిజర్వేషన్‌ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా సమ్మెను విరమించడం మంచిదని ఆయన అన్నారు. రోగులు ఇబ్బంది పడకూడదనే కారణంతో  సమ్మె విరమణపై తాను చొరవతీసుకుని చర్చలు జరిపాను, వైద్యులు సైతం రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. 50 శాతం రిజర్వేషన్‌లో కోర్టు నుంచి మంచి తీర్పును ఆశిస్తున్నానని అన్నారు.

మరిన్ని వార్తలు