సమ్మె విరమణ

30 Aug, 2014 23:32 IST|Sakshi
సమ్మె విరమణ

చెన్నై, సాక్షి ప్రతినిధి : రామేశ్వరంలోని మత్స్య కారులు 36 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం తాత్కాలికంగా విరమించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యథావిధిగా చేపల వేటకు వెళ్లే అవకాశం ఉంది. తమిళ జాలర్లపై శ్రీలంక పాల్పడుతున్న వేధింపులకు నిరసనగానూ, వారి స్వాధీనంలో ఉన్న 62 మర పడవలను అప్పగించాలని డిమాండ్ చేస్తూ జూలై 24న సమ్మె ప్రారంభించారు. సమ్మెలో భాగంగా చేపల వేటను బహిష్కరించారు. మరపడవలతో చేపల వేటపై ఆధారపడి ఒక్క రామేశ్వరంలోనే 30 వేల మత్స్యకార్మికులు ఉన్నారు. వీరికి చేపలు పట్టడం మినహా మరే వృత్తిలోనూ ప్రవేశం లేనందున సమ్మె కాలంలో ఆకలిదప్పులతో అలమటించారు.
 
 ఈ సమ్మెపై రామేశ్వరం హార్బర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు ఎన్ దేవదాస్, మరపడవల సంఘం అధ్యక్షుడు బీ శేషురాజా, ప్రధాన కార్యదర్శి ఎస్ ఎమ్రిడ్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా సమ్మె కొనసాగడం వల్ల మత్స్యకారులతోపాటు వారి కుటుంబాల వారు తిండిలేక ఆకలితో అల్లాడుతున్నారని చెప్పారు. ఈ కారణంగా సమ్మెను తాత్కాలికంగా విరమించాలని తామే ఒత్తిడి చేసినట్లు చెప్పారు. సమ్మె కాలంలోనే శ్రీలంక, భారత్ మధ్య చర్చలు కూడా సాగినట్లు వారు తెలిపారు. అలాగే యాళైపానంలో మరోసారి ఇరుదేశాల మధ్య చర్చలు నిర్వహించనున్నారని వారు చెప్పారు.
 
 ఈ చర్చల సందర్భంగా శ్రీలంక ఆధీనంలో ఉన్న మర పడవలను తిరిగి అప్పగించే అవకాశం ఉందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. అంతేగాక తమిళనాడు మత్స్యకారులు శాంతియుత వాతావరణంలో చేపల వేట సాగించేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం జరగవచ్చనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కారణాల దృష్ట్యా జాలర్ల సమ్మెను విరమింపజేసినట్లుగా వారు వివరించారు. ఇది కేవలం తాత్కాలిక విరమణ మాత్రమేనని వారు అన్నారు. శ్రీలంక, భారత్‌ల చర్చలు సామరస్య ఒప్పందానికి దారితీయని పక్షంలో మళ్లీ సమ్మెకు పిలుపునిస్తామని వారు స్పష్టం చేశారు.
 
 

మరిన్ని వార్తలు