పోలీసుల సమ్మెతో ప్రభుత్వం కూలుతుందా?

19 Aug, 2016 02:47 IST|Sakshi
పోలీసుల సమ్మెతో ప్రభుత్వం కూలుతుందా?

బెంగళూరు: ‘పోలీసులు సమ్మె చేస్తేనే ప్రభుత్వం కూలిపోతుందా? అసలు ఏ ఆధారాలతో శశిధర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు?’ అని హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ బైరారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వివరాలు....పోలీసుల డిమాండ్ల పరిష్కారానికి గతంలో పోలీసుల సమ్మెకు కర్ణాటక పోలీసు మహా సంఘం అధ్యక్షుడు శశిధర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసును నమోదు చేసింది. దీంతో శశిధర్ జామీను కోసం హైకోర్టును ఆశ్రయించగా గురువారం వాదనలు జరిగాయి. శశిధర్ తరఫున  న్యాయవాది అశోక్ హార్నల్లి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నణ్ణ వాదనలను వినిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి ఆనంద్ బైరారెడ్డి ...... ‘శశిధర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను ఇవ్వడం మీకు సమ్మతమేనా, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల వంటి సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధంతో పాటు ఇంటర్వూలు ఇవ్వరాదనే నిర్భంధనలతో బెయిల్‌ను మంజూరు చేస్తే మీకెలాంటి అభ్యంతరం లేదు కదా?’ అని శశిధర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.


తమకెలాంటి అభ్యంతరం లేదని అశోక్ హార్నల్లి పేర్కొన్నారు. దీంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నణ్ణ కలగజేసుకుంటూ....‘శశిధర్ పోలీసులను రెచ్చగొట్టి సమ్మె చేయించాలనుకున్నారు? ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు? అందువల్ల అతనికి బెయిల్‌ను మంజూరు చేయవద్దు’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.... ‘పోలీసుల సమ్మెతో ప్రభుత్వం కూలిపోతుందా? ఏ ఆధారాలతో శశిధర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించంతో పొణ్ణన్న మిన్నకుండిపోయారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన తర్వాత శశిధర్ జామీనుకు సంబంధించిన తీర్పును న్యాయమూర్తి రిజర్వ్‌లో ఉంచారు.

 

మరిన్ని వార్తలు