కరస్పాండెంట్ అత్యాచారం చేశాడని..

1 Apr, 2017 11:16 IST|Sakshi
కరస్పాండెంట్ అత్యాచారం చేశాడని..

కేకే.నగర్‌: చెన్నైలో పాఠశాల విద్యార్థినిపై కరెస్పాండెంట్‌ అత్యాచారం జరపడంతో ఆమె ఆత్మహుతి చేసుకుని మృతి చెందింది. దీనికి సంబంధించి న్యాయం కోసం ప్రజలు పాఠశాలను ముట్టడించడంతో పోలీసులు పాఠశాలకు తాళం వేశారు. చెన్నై కోయంబేడు సీమాత్తమ్మన్ నగర్‌కు చెందిన పళనివేలు(40) కోయంబేడు మార్కెట్‌లో టమాట వ్యాపారం చేస్తున్నాడు. ఇతని కుమార్తె మణిమాల(14). విరుగంబాక్కంలో గల ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదివింది.

పళనివేలు చెల్లెలు శశికళ(37) అళగమ్మాళ్‌ నగర్‌లో నివసిస్తోంది. ఈమె భర్త శరవణన్(42) నెర్‌కుండ్రంలో పాఠశాల నడుపుతున్నాడు. మణిమాల సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చే సమయంలో అత్త ఇంటికి వెళ్ల రావడం అలవాటు. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చిన మణిమాలపై మత్తుమందు చల్లి అత్యాచారం జరిపారు. జరిగిన సంఘటన గురించి ఎవరికి చెప్పవద్దని ఆమెను బెదిరించాడు. అయితే మణిమాల ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది.

దిగ్భ్రాంతి చెందిన అతడు తన వలన చెల్లెలు జీవితం నాశనం కాకూడదని మౌనం వహించాడు. ఆ తరువాత మణిమాల అత్త ఇంటికి వెళ్లడం మానేసింది. ఇదిలా ఉండగా బుధవారం ఇంటిలో మణిమాల ఆత్మహుతి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని కోయంబేడు మార్కెట్‌ పోలీసుల ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఆమె సూసైడ్‌ నోట్‌లో మామ, అత్త ఇద్దరూ తనను అశ్లీలంగా చిత్రాలు తీశారని, శరవణన్ తనపై అత్యాచారం జరిపాడని మనస్తాపంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉంది.

పరారీలో వున్న శశికళ, శరవణన్ ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శరవణన్, శశికళలను అరెస్టు చేయాలని పళనివేల్‌ బంధువులు ప్రజలు 150 మందికి పైగా శుక్రవారం ఉదయం శరవణన్ నడుపుతున్న పాఠశాలను ముట్టడించి ఆందోళన జరిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్కూలుకు తాళం పెట్టి ప్రజలతో చర్చలు జరిపారు. శరవణన్ ను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో  ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు