వడ్డీలో రాయితీ

30 Apr, 2015 05:22 IST|Sakshi
వడ్డీలో రాయితీ

రాష్ర్టంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకే...
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి


సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు అందజేసే రుణాలకు వడ్డీలో రాయితీని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమిళనాడులో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న రుణాలకు వడ్డీలో 4శాతం రాయితీని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు.

అదే విధంగా కర్ణాటకలోనూ అమలు చేయడంపై ఉన్న సాధకబాధకాలపై అధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు రూ.5కోట్ల వరకు రుణాలకు వడ్డీ రాయితీ అందజేస్తున్నామని, ఇదే విధంగా ఒబిసి వర్గానికి చెందిన వ్యాపార వేత్తలకు సైతం రుణాలను అందజేయాలని డిమాండ్‌లు వస్తున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు గాను ఆయా ప్రాంతాల్లోని సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

నేడు ప్రధానితో అఖిలపక్షం భేటీ.......
రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నిర్మించతలపెట్టిన మేకెదాటు జలాశయ నిర్మాణం, మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన తదితర అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు గాను నేడు(గురువారం) అఖిల పక్ష సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.

మేకెదాటు జలాశయ నిర్మాణం విషయంలో తమిళనాడు రాజకీయాలకు పాల్పడుతూ, జలాశయ నిర్మాణానికి అడ్డుపడుతోందని సిద్ధరామయ్య విమర్శించారు. అయితే తమిళనాడు ప్రభుత్వ వైఖరికి తామెంత మాత్రం భయపడబోమని తెలిపారు. న్యాయం కర్ణాటక వైపే ఉందని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి సైతం వివరిస్తామని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు