విద్యుత్ కోతలతో వెతలు

9 May, 2014 22:42 IST|Sakshi
విద్యుత్ కోతలతో వెతలు

- నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్‌లోనూ  అదే సమస్య
- గగ్గోలు పెడుతున్న వినయోగదారులు
- పత్యామ్నాయాల్లో డిస్కమ్‌లు

 
న్యూఢిల్లీ: ఉడికిస్తున్న వేడికి తోడు... పలుచోట్ల విద్యుత్ కోతలతో తూర్పు ఢిల్లీ వాసులు శుక్రవారం తిప్పలుపడ్డారు. కొన్ని అవరోధాల కారణంగా విద్యుత్ సరఫరా ఆగిపోయిందని  విద్యుత్ పంపిణీ కంపెనీ బీఎస్‌ఈఎస్ తెలిపింది. ఇదిలా ఉంటే బీైవె పీఎల్ సంతృప్తికరంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న బదర్‌పూర్-నోయిడా-ఘాజిపూర్  220 కిలోవాట్ల ట్రాన్స్‌మిషన్ లైన్‌లో ఊహించని అడ్డంకుల వల్ల మే ఒకటి నుంచి 75 నుంచి 100 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని సంస్థ తెలిపింది. ఆ సమస్యను సవరిస్తున్నామని, రెండు మూడు వారాల్లో పూర్తిగా పరిష్కారమవుతుందని సంస్థ అధికారి ప్రతినిధి తెలిపారు.

మండోలా-సౌత్ వజీరాబాద్-పత్పర్‌గంజ్ ట్రాన్స్‌మిషన్ లైన్‌లో 220 కిలోవాట్ల ఓవర్‌లోడ్ వల్ల సమస్య తలెత్తిందన్నారు. అందువల్ల అత్యవసర సమయాల్లోనే 20 నుంచి 25 మెగావాట్ల కొరత ఏర్పడుతోందని చెప్పారు. కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రారంభించిందని, ఏవైనా సమస్యలుంటే వినియోగదారులు ఆయా నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. విద్యుత్ సంబంధిత సమస్య ఏదైనా ఎదురైత్తే... బీఎస్‌ఈఎస్ 24్ఠ7కాల్ సెంటర్ 399 99 808(బీవైపీఎల్), 399 99 707 (బీఆర్‌పీఎల్) నంబర్లకు కాల్ చేయొచ్చని తెలిపారు.

ఈ సమస్యలను అధిగమించి విద్యుత్ సరఫరా చేయడానికి బీవైపీఎల్ ప్రత్యామ్నాయ వనరుల కోసం చూస్తోందని చెప్పారు. కోండ్లి, డల్లుపురా, ఘాజీపూర్, వివేక్ విహార్, నంద్ నగరి, యమునా విహార్, మయూర్ విహార్ ప్రాంతాల్లో పాక్షికంగా విద్యుత్ సమస్య ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం తూర్పు, మధ్య ఢిల్లీలో 1,150 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, దక్షిణ, పశ్చిమ ఢిల్లీలకు 1800 మెగావాట్లు అవసరమవుతున్నది. భవిష్యత్‌లో ఈఅవసరం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

నోయిడా: ఢిల్లీలోనే కాదు... నోయిడా, ఘజియాబాద్‌లలో ప్రతిరోజూ ఆరు నుంచి 18 గంటల విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో తప్పనసరి పరిస్థితుల్లో డీజిల్‌తో నడిచే పవర్ సిస్టమ్స్‌పై ఆధారపడుతున్న నెలసరి వేతన కుటుంబాలకు కష్టాల కడలిని ఈదుతున్నాయి. ఇందిరాపురం, వైశాలి, కౌశాంబి ప్రాంతాల్లోని హౌజింగ్ సొసైటీల్లో విద్యుత్ కోతల సమయంలో పవర్ బ్యాకప్ సరఫరాకు యూనిట్‌కు 17 నుంచి 19 రూపాయలు చెల్లిస్తున్నారు. దీనివల్ల 150 నుంచి 200 ఫ్లాట్లున్న చిన్న సొసైటీలు రోజుకు రూ. 13 వేల నుంచి 17 వేల వరకూ విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాయి.

 ఇక పెద్ద సొసైటీల్లో రూ. 70 వేల నుంచి లక్ష వరకు చెల్లిస్తున్నట్టు ఘజియాబాద్ అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. అపార్ట్‌మెంట్లలో వాళ్లే కాకుండా స్వతంత్ర ఇళ్ల యజమానులుకూడా విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరెంజ్ కౌంటీ హౌసింగ్ సొసైటీలో వ్యాపారి మనోజ్ గుప్తానే ఇందుకు ఉదాహరణ. నలుగురు సభ్యులున్న కుటుంబానికి వేసవిలో సగటున వెయ్యి యూనిట్లకు గాను 11 వేల రూపాయలు బిల్లు చెల్లించాల్సి వ స్తోంది. సాధారణ సమయాలతో పోల్చుకుంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

 డీజిల్‌తో నడిచే జనరేటర్ల విద్యుత్ మినహాయిస్తే... 500 యూనిట్లకు గాను ప్రతి నెలా రూ. 2,350 బిల్లు వచ్చేది. అయితే కోతల వల్ల విద్యుత్ బిల్లులకోసం మిగిలిన  ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోందని గుప్తా తెలిపారు. ఎక్కువ గంటలు కోతలు ఉండటంతో ఇన్వర్టర్ల పవర్ సరిపోక... నోయిడాలోని రెసిడెన్షియల్ సెక్టార్లలో నివసించేవారు జెనరేటర్ల మీద ఆధారపడుతున్నారు. విద్యుత్ బిల్లు 3వేలకు అదనంగా... ప్రత్యామ్నాయ విద్యుత్‌కోసం 2,500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని సుశీల్ జైన్ చెబుతున్నారు.

గుర్గావ్: గుర్గావ్ పవర్ డిస్కమ్ డీహెచ్‌బీవీఎన్ కష్టకాలాన్ని ఎదుర్కొంటుండటంతో విద్యుత్ కొరతతో ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. విద్యుత్ కోతలు లేని జోన్‌గా గుర్గావ్‌కు మంచిపేరున్నా... మౌలిక వసతులను పెంచుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించింది డీహెచ్‌బీవీఎన్. ఓవర్‌లోడింగ్, స్థానిక పొరపాట్లు, నిర్వహణా లోపాలు, విద్యుత్ చౌర్యంవల్ల కోట్ల రూపాయల నష్టాలతో డిస్కమ్ కష్టాల్లో పడింది. దీంతో కొత్త, పాత గుర్గావ్‌లోని ప్రజలు ఈ వేసవిలో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఓవర్ లోడింగ్, తరచుగా స్థానికంగా జరుగుతున్న తప్పులవల్ల విద్యుత్ కోతలు తప్పడం లేదని డిస్కమ్ అధికార వర్గాలు చెబుతున్నాయి.

వివిధ ప్రాంతాలనుంచి ప్రతినిధులు వెళ్లి డీహెచ్‌బీవీఎన్ చీఫ్ ఇంజనీర్‌ను కలిస్తే... స్థానికంగా జరుగుతున్న పొరపాట్లు, నిర్వహణ లోపాలే అందుకు కారణమని చెబుతున్నాడని గుర్గావ్ సిటిజన్ కౌన్సిల్ సభ్యుడు ఆర్ ఎస్ రథీ తెలిపారు. ఒక లైన్ మరమ్మతులో ఉండటం వల్ల సమస్య తలెత్తిందని, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఇంజనీర్ చెప్పాడన్నారు. అయితే డీహెచ్‌బీవీఎన్ సరఫరాలో కోతలే లేవంటున్నారు డిస్కమ్ మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్‌కుమార్. గుర్గావ్ ప్రజల అవసరాలకు తగినంత విద్యుత్‌ను తాము సరఫరా చేస్తున్నామని, అయితే ప్రజలకు చేరేముందు ట్రాన్స్‌మిషన్ స్థాయిలో ఏవైనా సమస్యల వల్ల కొరత ఉండొచ్చన్నారు.

సెక్టార్ 43, 51ల్లోని సబ్ స్టేషన్లలో ఎప్పుడూ ఓవర్‌లోడ్ అవుతుందని, దీనివల్ల సమస్య వస్తోందని, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు అనుమతించామని, ఈ నెల ఆఖరుకల్లా అది పూర్తవుతుందని అరుణ్‌కుమార్ చెప్పారు. విద్యుత్ చౌర్యం కూడా ఇందుకు ఒక కారణమన్నారాయన. స్థానికంగా జరుగుతున్న పొరపాట్లను ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తూ, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ లోడ్ పడకుండా చూస్తున్నామని, అవసరమున్న చోట్ల కొత్త కేబుళ్లు అమరుస్తున్నామని తెలిపారు.

 డిస్కమ్ ఇప్పటికే 400 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిందని డీహెచ్‌బీవీఎన్ జనరల్ మేనేజర్  సంజీవ్ చోప్రా చెప్పారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో కోత తప్పనిసరి అని తెలిపారు. 10 కిలోవాట్ల నుంచి 50 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉన్న చోట మామూలు మీటర్ల స్థానంలో స్మార్ట్  మీటర్లు ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్టు తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లను తాము వైర్‌లెస్ సాయంతో నియంత్రించే అవకాశం ఉందని, దీనివల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయని చోప్రా చెప్పారు.

మరిన్ని వార్తలు