స్తంభించిన పాలన

3 Jun, 2016 02:17 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె  విజయవంతం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ   కార్యాలయాలు వెలవెల
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వేతనాలు సవరించాలని డిమాండ్

 

 

బెంగళూరు:  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలన స్తంభించింది. వేతన తారతమ్యాలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గురువారం రోజున సామూహికంగా సెలవులు పెట్టారు. దీంతో పాలనా కేంద్రమైన విధానసౌధతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిగా బోసిపోయి కనిపించాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత, భత్యాలతో సమానంగా తమకూ జీత, భత్యాలను అందజేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగి, సామూహిక సెలవులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం 84 శాఖల్లోనూ కార్యకలాపాలన్నీ స్తంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.40 లక్షల మంది ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సామూహిక సెలవు పెట్టారు. ఇక ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ‘డి’గ్రూప్ ఉద్యోగులు సైతం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో పాలనా కేంద్రాలైన విధానసౌధ, వికాససౌధలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలన్నింటిలో కనీసం తలుపులు తెరిచే పరిస్థితి కూడా కనబడలేదు. కలెక్టర్‌ల కార్యాలయాలతో పాటు తాలూకా, హోబళి స్థాయిల్లోని కార్యాలయాలన్నీ గురువారం రోజున ఉద్యోగుల సామూహిక సెలవుతో నిర్మానుష్యంగా కనిపించాయి. కాగా, ఈ నిరసన కార్యక్రమం నుంచి అత్యవసర సేవలైన  వైద్యం, అగ్నిమాపక దళం, తాగునీటి సరఫరా విభాగాల్లోని కొంతమందికి మాత్రమే మినహాయింపు నిచ్చారు.


అయినప్పటికీ ఆయా శాఖల్లోని ఉద్యోగులు నల్లని పట్టీని ధరించి నిరసనకు తమ మద్దతు ప్రకటించారు. ఇక ఈ నిరసన కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.పి.మంజేగౌడ వెల్లడించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల నిరసన ఎటువంటి హింసాత్మక ఘటనలకు దారి తీయకుండా ముగిసిపోయిందని భావించడానికి వీలులేదు. ఈనెల 4న సమాజంలో శాంతి, భద్రతలను కాపాడడంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే పోలీసులు కూడా తమ డిమాండ్‌ల పరిష్కారానికి నిరసన బాట పట్టనున్నారు. వీరు కూడా సామూహిక సెలవుల ద్వారా తమ నిరసనను తెలియజేయనున్నారు.

 

పోలీసుల సంఘం అధ్యక్షుడి అరెస్ట్....
ఇక పోలీసులను నిరసనల దిశగా ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలపై అఖిల కర్ణాటక పోలీస్ మహాసంఘ అధ్యక్షుడు శశిధర్‌ను అరెస్ట్ చేశారు. యలహంక ఉపనగరలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం అర్థరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. పోలీసుల నిరసన కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శశిధర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో శశిధర్ నివాసంలో ఉన్న కరపత్రాలు, కంప్యూటర్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శశిధర్‌ను గురువారం ఉదయం న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా శశిధర్‌కు ఈనెల 16వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. అనంతరం శశిధర్‌ను పరప్పన అగ్రహార జైలుకు తరలించగా ఆయన అక్కడే ఉపవాస సత్యాగ్రహానికి పూనుకున్నారు. తమ డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తన దీక్షను విరమించబోనని శశిధర్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు