గ్రామీణుల కష్టాల సంగతేంటి?

3 Dec, 2016 02:34 IST|Sakshi
గ్రామీణుల కష్టాల సంగతేంటి?

సహకార సంఘాల్లో నగదు కొరతపై ఏం చర్యలు తీసుకున్నారు?
‘నోట్ల రద్దు’పై కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న
కావాలనే సహకార సంఘాల్ని నగదు మార్పిడి నుంచి తప్పించాం: కేంద్రం 

 న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అసౌకర్యాల్ని పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే సామాన్యులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు పరిష్కరించేందుకు తీసుకున్న చర్యల్ని పేర్కొంటూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందా? లేదా?, నగదు దొరక్క ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం శుక్రవారం వాదనలు ఆలకించింది.

నోట్ల రద్దు అనంతరం వేర్వేరు అంశాలపై వివిధ హైకోర్టుల్లో అనేక కేసులు దాఖలయ్యాయని, కేరళ, కోల్‌కతా, జైపూర్, ముంబై... ఇలా వివిధ హైకోర్టుల్లో దాఖలైన కేసులు డీల్ చేయడం తమకు సాధ్యం కాదని, అన్నీ కలిపి ఏదోఒక హైకోర్టుకు బదిలీ చేయడమో లేదా... సుప్రీంకోర్టులో విచారించడమో చేయాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు.

నోట్ల రద్దు అనంతరం దాఖలైన అన్ని పిటిషన్లను సంబంధిత పార్టీలన్నీ కలిసి కూర్చుని పరిశీలించి... ఏ కేసులు హైకోర్టులకు బదిలీ చేయవచ్చో, ఏవి సుప్రీంకోర్టులో విచారించవచ్చో పేర్కొంటూ జాబితా సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ... పిటిషనర్లు అందరూ కలిసి కూర్చుని జాబితా రూపొందించి సోమవారం కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు. 

సహకార సంఘాల్లో నకిలీలను గుర్తించే సౌకర్యం లేదు: కేంద్రం
సహకార సంఘాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడ్డారని, నోట్ల రద్దు అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ అటార్నీ జనరల్‌ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రోహత్గీ సమాధానమిస్తూ... మిగతా బ్యాంకులతో పోలిస్తే సహకార బ్యాంకుల్లో సరైన మౌలిక వసతులు, యంత్రాంగం లేదన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. కేంద్రం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌లో సహకార బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల్నే పేర్కొన్నామని చెప్పారు.

ప్రభుత్వం కావాలనే నగదు మార్పిడి, సరఫరా నుంచి సహకార సంఘాల్ని దూరం పెట్టిందని, నకిలీ కరెన్సీని గుర్తించే నిపుణత సహకార బ్యాంకుల వద్ద లేదని రోహత్గీ వాదించారు. సహకార సంఘాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పి.చిదంబరం వాదిస్తూ... సహకార సంఘాల్ని నగదు మార్పిడి పక్రియలో చేర్చకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. అనంతరం కోర్టు వాదనలను డిసెంబర్ 5కు వారుుదా వేసింది.

మరిన్ని వార్తలు