డిస్కమ్‌లు సహకరించడం లేదు

3 Mar, 2014 23:21 IST|Sakshi
డిస్కమ్‌లు సహకరించడం లేదు

 కోర్టుకు కాగ్ ఫిర్యాదు

ఆడిటింగ్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ


 సాక్షి, న్యూఢిల్లీ:
 ఖాతాల ఆడిట్‌కు మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డి స్కమ్‌లు) సహకరించడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)   ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలిపింది. ఆడిట్ చేయాల్సిన పత్రాలను డిస్కమ్‌లు తనకు అందజేయడం లేదని కాగ్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం డిస్కమ్‌ల ఆడిట్‌కు సంబంధించిన కేసును పరిశీలించింది. ఆడిట్‌కు సహకరించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వును డిస్కమ్‌లు సవాలు చేశాయి. ఆడిటింగ్‌ను నిలిపి వేయడానికి ఏకసభ్య ధర్మాసనం నిరాకరించడమేగాక, ఈ ప్రక్రియకు సహకరించాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ జనవరి 24న ఉత్తర్వులు జారీ చేసింది.
 
  కేజ్రీవాల్ సర్కారు డిస్కమ్‌ల ఖాతాలపై కాగ్ ఆడిటింగ్‌కు జారీ చేసిన ఉత్తర్వును డిస్కమ్‌లు హైకోర్టులో సవాలు చేశాయి. ప్రైవేటు కంపెనీల ఖాతాలను ఆడిట్ చేసే అధికారం కాగ్‌కు లేదని పేర్కొంటూ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌కు ఏకసభ్య ధర్మాసనం అనుకూలంగా ప్రతిస్పందిచకపోవడంతో అవి ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాయి.  దీనిపై మార్చి ఏడున విచారణ జరగవలసి ఉంది. కానీ టెలికాం కంపెనీల ఖాతాలపై కాగ్ ఆడిట్‌కు సంబంధించిన కేసు మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట విచారణకు రానున్నందున తమ పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని డిస్కమ్‌లు  న్యాయస్థానాన్ని కోరాయి.
 
 డిస్కమ్‌లు ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వును ఉల్లంఘిస్తున్నందువల్ల వాటి విజ్ఞప్తిని పట్టించుకోవద్దని ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. కాగ్ తరపున హాజరైన న్యాయవాది అమన్ లేఖీ కూడా ప్రశాంత్ భూషణ్ వాదనతో ఏకీభవించారు. టాటా పవర్ లిమిటెడ్‌తో పాటు అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన డిస్కమ్‌లు బీఎస్‌ఈఎస్ రాజధాని, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ ఆడిట్‌కు సహకరించడం లేదని పేర్కొన్నారు. తమ ఫైళ్లను డిస్కమ్‌లు కాగ్‌కు సమర్పించడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. డిస్కమ్‌ల ఖాతాలను కాగ్ ఆడిట్ చేయించాలని కోరుతూ నివాసుల సంక్షేమ సంఘాల (ఆర్‌డబ్ల్యూఏలు) సమాఖ్య  దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతోన్న డివిజన్ బెంచ్‌కు ఈ కేసును అప్పగించాలని ప్రశాంత్ భూషణ్, అమన్ లేఖీ కోరారు. అయితే న్యాయస్థానం దీనిపై మార్చ్ 24న విచారణ నిర్వహిస్తామని పేర్కొంది.
 
 ప్రతిపక్షాలు కూడా డిస్కమ్‌ల వ్యవహారాల శైలిపై పలుసార్లు అనుమానాలు వ్యక్తం చేశాయి. అవి తమ ఆదాయాలను తగ్గించి చూపుతున్నాయని ఆప్ పలుసార్లు ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే డిస్కమ్‌ల ఖాతాలపై ఆడిటింగ్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మేరకు ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, కరెంటు కొనుగోలుకు నిధులు లేవని డిస్కమ్‌లు వాదిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఇంధన కొనుగోలు సర్దుబాటు చార్జీలను పెంచడానికి అనుమతిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు