‘ఉప్‌హార్’ కేసులో అన్సల్ సోదరులు దోషులే!

5 Mar, 2014 22:33 IST|Sakshi
‘ఉప్‌హార్’ కేసులో అన్సల్ సోదరులు దోషులే!

 న్యూఢిల్లీ: ఉప్‌హార్ థియేటర్‌లో 1997లో అగ్నిప్రమాదం జరిగి 59 మంది మరణించిన ఘటనకు దాని యజమానులు, సుశీల్, గోపాల్ అన్సల్ సోదరులే బాధ్యులని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ప్రేక్షకుల భద్రత కంటే డబ్బు సంపాదనే వీరికి ముఖ్యమైనదని అభిప్రాయపడింది. అయితే దిగువకోర్టు వీరికి విధించిన శిక్షను ద్విసభ్య ధర్మాసనం ధ్రువీకరించలేదు. ఎంతకాలం శిక్ష విధించాలనే విషయమై నిర్ణయం తీసుకునే బాధ్యతను త్రిసభ్య బెంచ్‌కు అప్పగించింది. ఇది వరకే హైకోర్టు వీరికి విధించిన ఏడాది శిక్షను కొనసాగించాలని న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆదేశించారు. సుశీల్ వయసును దృష్టిలో ఉంచుకొని శిక్షను తగ్గించగా, గోపాల్‌కు మాత్రం రెండేళ్ల శిక్ష విదించారు. ట్రామా సెంటర్, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు రూ.100 కోట్లు చెల్లించాలని కూడా హైకోర్టు వీరిని ఆదేశించింది.
 
 ఈ కేసులో సీబీఐ, ఉప్‌హార్ అగ్నిప్రమాద బాధితుల సంఘం, అన్సల్ సోదరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు పైతీర్పు చెప్పింది. డీవీబీ ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యం వల్ల అగ్నిప్రమాదం జరిగినందున తమకు శిక్ష విధించడం సరికాదన్న అన్సల్ సోదరుల వాదనను కోర్టు తిరస్కరించింది. చట్టాల్లో లోపాల వల్లే అన్సల్ వంటి వాళ్లు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలతో ఏకీభవించింది. ఈ సందర్భంగా సీబీఐ స్పందిస్తూ ఢిల్లీ హైకోర్టు శిక్షల ఖరారులో తప్పుడు పద్ధతిని అనుసరించిందని వాదించింది. శిక్ష తగ్గింపు సరికాదని పేర్కొంది. దోషులపై 304 (హత్యగా పరిగణించలేని శిక్షార్హమైన నరహత్య), 304 ఏ (నిర్లక్ష్యపూరిత చర్యలతో మరణానికి కారకులు కావడం) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయినందున శిక్షాకాలాన్ని పెంచాలని కోరింది. ఏవీయూటీ కూడా ఇదే తరహా విజ్ఞప్తి చేసింది.
 

మరిన్ని వార్తలు