ఏమిచేస్తున్నారు? పోలీసుల అచేతనత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

9 May, 2014 23:01 IST|Sakshi
ఏమిచేస్తున్నారు? పోలీసుల అచేతనత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఆస్తివివాదానికి సంబంధించి కోర్టు ఉత్వర్వు ఇవ్వడానికి వెళ్లిన మహిళా న్యాయవాదికి రక్షణ కల్పించకుండా ఏమిచేస్తున్నారంటూ నగర పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం... సదరు న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలకు సంబంధించి తనకు ఈ నెల 14వ తేదీలోగా ఓ నివేదిక సమర్పించాలంటూ నగర పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బాధిత న్యాయవాదికి ఎటువంటి హానీ జరగకుండా చూడాలంటూ తూర్పు విభాగం డీసీపీని కూడా ఆదేశించింది.

నాలుగు వారాలు గడిచిపోయినా తనపై దాడిచేసిన వారిపై పోలీస్ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తమకు సమాచారం అందిందని ధర్మాస నం పేర్కొంది. కాగా బాధిత అడ్వొకేట్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాసిన లేఖను ధర్మాసనం పిటిషన్ కింద విచారణకు స్వీకరించింది. కోర్టు ఉత్తర్వును అందజేయడానికి వెళ్లిన రోజు జరిగిన పరిణామాలను బాధితురాలు తన లేఖలో పేర్కొంది. కాగా బాధిత అడ్వొకేట్ అంబికాదాస్ గత నెల నాలుగో తేదీన తనపై దాడికి సంబంధించి దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది.

 కోర్టు ఉత్తర్వులను హిమ్మత్‌రాయ్ మల్హోత్రాకు అందజేయడానికి తాను వెళ్లానని, అయితే ప్రతివాదివైపు తాను మొగ్గానని ఆరోపిస్తూ ఆ ఇంట్లోని వారు తనను లాగిపడేయడమే కాకుండా కొట్టారని బాధితురాలు తన లేఖలో ఆరోపించింది. ఏప్రిల్ ఆరో తేదీన ఈ ఘటన జరిగిందని, అదే రోజు బాధితురాలు 100వ నంబర్‌కు ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేసిందని కోర్టు తెలిపింది.

 అంతేకాకుండా ఈ-మెయిల్‌ద్వారా కూడా ఓ ఫిర్యాదు పంపిందని తెలిపింది. అప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత నెల 14వ తేదీన ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిందంది. కాగా బాధితురాలి తరఫు వాదనలను వినిపించేందుకు ఎమికస్ క్యూరీగా సీనియర్ అడ్వొకేట్ విజయ్ హ న్సారియాను కోర్టు నియమించిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు