డీఎస్పీ గణపతి కేసులో కర్ణాటకకు ఎదురుదెబ్బ

5 Sep, 2017 15:42 IST|Sakshi
డీఎస్పీ గణపతి కేసులో కర్ణాటకకు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: మడికెర డీఎస్పీ ఎంకే గణపతి ఆత్మహత్య కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కర్ణాటక సర్కార్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా తన సూసైడ్‌ నోటులో మాజీ హోంమంత్రి జార్జి పేరును డీఎస్పీ గణపతి పేర్కొన్న విషయం తెలిసిందే.

కాగా గత ఏడాది (2016 జూన్‌7) కొడగు జిల్లా మడికెరి నగరంలోని ఓ లాడ్జ్‌లో డీఎస్పీ గణపతి ఉరివేసుకుని మరణించిన స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు గణపతి ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఏదేని విపరీత నిర్ణయం తీసుకున్నా, లేదా తనకు ఏమైనా జరిగినా అందుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులైన ప్రణవ్‌ మొహంతి, ఎ.ఎం ప్రసాద్‌లు కారణమని తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో గణపతి కుమారుడైన నేహాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ఇదే సందర్భంలో విమర్శలు వెల్లువెత్తడంతో కే.జే జార్జ్‌తో రాజీనామ చేయించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేసును సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు.

అయితే గణపతి మరణానికి– జార్జ్, ఇతర అధికారులకు సంబంధం లేదని తేలిందని సీఐడీ రిపోర్టును అందజేయడంతో జార్జ్‌కి మళ్లీ నగరాభివృద్ధి మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం విజ్ఞప్తిని తిరస్కరించింది.

మరిన్ని వార్తలు