తాళంతో..వేళాకోళమా..?

9 Jun, 2018 08:54 IST|Sakshi
శ్రీమందిరం 

భువనేశ్వర్‌ : పూరీ జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు నేపథ్యంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించింది.  శ్రీ మందిరం నిర్వహణలో లోపాలపట్ల  సుప్రీం కోర్టు పెదవి విరిచింది. దేవస్థానం పాలనా వ్యవహారాల్లో లోపాల సవరణ కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రముఖ దేవస్థానాల నిర్వహణ పరిశీలించాలి. ఈ నెల 30 నాటికి సమగ్ర నివేదికను దాఖలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. జూలై నెల 5వ తేదీన శ్రీ మందిరం నిర్వహణ లోపాలకు సంబంధించి తదుపరి విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది.  

జగన్నాథుని దేవస్థానం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు వ్యవహారాన్ని పురస్కరించుకుని కటక్‌ మహానగరంలో ఉంటున్న  మృణాళిని పాఢి అనే మహిళ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.  3 ప్రధాన అంశాలతో ఈ కేసు దాఖలైంది. భక్తులు, యాత్రికులకు వేధింపులు, లోపిస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ, దేవస్థానం నిర్వహణ లోపం అంశాలపట్ల సుప్రీం కోర్టు దృష్టిని ఆకట్టుకునేందుకు ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆమె వివరించారు. లక్షలాది యాత్రికులు, భక్తులు సందర్శించే ప్రముఖ దేవస్థానాలు మోసాలకు పాల్పడరాదు. భక్తులు సమర్పించే విరాళాలు దేవుని ఖాతాలో దేవస్థానం సమగ్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి తప్ప సేవాయత్‌లు, ఇతరేతర ఆలయ సిబ్బంది బాగోగుల కోసం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ వర్గపు జీతభత్యాల్ని దేవస్థానం కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు సునాయాశంగా దైవదర్శనం కల్పించాలి. అర్చకులు ఇతరేతర అనుబంధ వర్గాలు భక్తుల నుంచి దోపిడీ వంటి చర్యలకు పాల్పడడం ఎంత మాత్రం తగదని సుప్రీం కోర్టులో విచారణ జరిపిన జస్టిస్‌ ఆదర్శ కుమార్‌ గోయల్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. యాత్రికులు, భక్తుల నుంచి ఆలయ వర్గాలు ప్రత్యక్షంగా విరాళాలు, దక్షిణలు గుంజుతున్న ఆచారంపట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసాకు లెక్క ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దేవస్థానాల ఆర్థిక ప్రణాళిక, వ్యవహారాలు పూచీదారితనంతో కొనసాగాలని అభిప్రాయపడింది.  

ప్రత్యేక ప్యానెల్‌తో పరిశీలన
దేశంలో ప్రముఖ దేవస్థానాల సాంస్కృతిక, నిర్మాణ శైలి పరిరక్షణ కార్యాచరణ పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో పేరొందిన వైష్ణోదేవి, తిరుపతి, షిర్డీ సాయి, సోమనాథ్, అమృతసర్‌ స్వర్ణ ఆలయాల్లో భక్తులు, యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దేవస్థానం నిర్వహణ, ఆలయాల సంరక్షణ వగైరా అంశాల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరిశీలన నేపథ్యంలో జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో సంస్కరణలకు సిఫారసు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. 

ఈ నెల 30 నాటికి నివేదిక  
శ్రీ మందిరానికి విచ్చేస్తున్న భక్తులు ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, భక్తజనం నుంచి బలవంతంగా దక్షిణలు గుంజడం వగైరా అంశాలపై వాస్తవ స్థితిగతులతో సమగ్ర నివేదికను పూరీ జిల్లా జడ్జి ప్రదానం చేయాల్సి ఉంది. ఈ నెల 30వ తేదీ నాటికి ఈ నివేదిక దాఖలు చేసేందుకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నివేదిక రూపకల్పనలో జిల్లా కలెక్టర్‌తో  పాటు అనుబంధ యంత్రాంగం, శ్రీ మందిరం పాలక మండలి పూర్తి స్థాయిలో జిల్లా జడ్జికి సహకరించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. శ్రీ మందిరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, వాటి పని తీరు, పర్యవేక్షకుల వివరాల్ని నివేదికలో వివరిస్తారు. 

నివేదిక పరిశీలకు యామికస్‌ క్యూరీ
జగన్నాథుని దేవస్థాన సంస్కరణలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కమిటీ, పూరీ జిల్లా జడ్జి నివేదికల పరీశీలనకు యామికస్‌ క్యూరీగా గోపాల సుబ్రహ్మణ్యంను నియమించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. నివేదికను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీంకోర్టుకు వివరించాల్సి ఉంది. ఈ వివరణ ఆధారంగా జూలై  5వ తేదీన సుప్రీం కోర్టు తదుపరి విచారణ చేపడుతుంది. 

వాస్తవాల్ని బయట పెట్టండి : గవర్నర్‌ గణేషీ లాల్‌ 
భువనేశ్వర్‌ : శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు వివాదాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ పెదవి కదిపారు. తీవ్ర కలకలం రేకెత్తించిన ఈ సంఘటన వెనక వాస్తవాల్ని బయట పెట్టేలా చర్యలు చేపట్టాలని గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్‌ శుక్రవారం అన్నారు.   తాళం చెవి కనబడకుండా పోవడం అత్యంత విచారకరమని  పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ కమిషను ఏర్పాటుకు ఆదేశించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు