పరువు నష్టం కేసుల్లో కేజ్రీవాల్‌కు ఊరట

18 Apr, 2015 00:42 IST|Sakshi

- సమాధానం ఇవ్వాల్సిందిగా
- కేంద్ర న్యాయశాఖకు నోటీసు
- జారీ చేసిన సుప్రీం
- అంతవరకూ రెండు కేసులపై
- విచారణ నిలిపేయాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆయనపై ఢిల్లీలోని ట్రయల్ కోర్టుల్లో దాఖలైన రెండు క్రిమినల్ పరువు నష్టం కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే  పరువు నష్టాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్ట్టాల రాజ్యాంగ బద్దతను సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖకు నోటీసు జారీ చేసింది. సమాధానం వచ్చేంతవరకూ కేజ్రీవాల్‌పై దిగువ న్యాయస్థానంలో దాఖలైన రెండు నేరపూర్వక పరువు నష్టం కేసులపై విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్‌కు తాత్కాలికంగా ఊరట లభించింది.

ఈ పరువు నష్టం కేసులపై తదుపరి విచారణ జులై 8న జరుగనుంది. కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్‌ను, ఇదే విషయమై బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పెండింగ్ పిటిషన్ విచారణతో జోడించాలని న్యాయస్థానం ఆదేశించింది. కే జ్రీవాల్‌పై దాఖలైన పరువు నష్టం కేసుల్లో ఒకటి గడ్కరీ కేసిన పరువు నష్టం పిటిషన్ కాగా మరొకటి సురేందర్‌కుమార్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్. గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌పై పటియాలా హౌజ్ కోర్టు విచారణ జరుపుతోంది.

తనను అత్యంత అవినీతిపరుడైన నేతగా ఆరోపణలు చేయడాన్ని సవాలుచేస్తూ గడ్కరీ కేజ్రీవాల్‌పైనా, ఆయన సహచరులపైనా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లారు. ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని ఆశ చూపి ఆ తరువాత తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాక అవినీతిపరుడినంటూ తనపై అభాండాలు మోపారని ఆరోపిస్తూ న్యాయవాది సురేందర్‌‌ శర్మ సీఎం కేజ్రీవాల్‌పైనా, ఆప్ నేతలపైనా పరువు నష్టం దావా వేశారు. అ కేసు కడ్కడూమా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది.

మరిన్ని వార్తలు