అభ్యర్థుల ఖర్చుపై నిఘా

9 Mar, 2014 21:52 IST|Sakshi

 సాక్షి, ముంబై: ఎన్నికల సమయంలో డబ్బులు, మద్యం పంపిణి చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారో తస్మాత్ జాగ్రత్త. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చులపై నిఘా వేసేందుకు ఈసారి ముంబైలో ప్రత్యేకంగా 78 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించనున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నితిన్ గధారే తెలిపారు.
 
 రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించాయి. దీంతో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఏర్పాట్లపై షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా చేసిన ప్రచారాలు, సభలు, సమావేశాలన్నీ ఒక ఎత్తై, ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసే ప్రచారమే అంతే ప్రధానం కానుంది. ఓటర్లను అతి తక్కువ సమయంలో ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం, మహిళలకు చీరలు పంపిణీ చేయడం లాంటివి జోరుగా సాగుతాయి. ఇవి అన్ని పార్టీల అభ్యర్థులు చేపడుతున్నా  బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంటారు. అందుకే వీటిపై నిఘా వేసేందుకు ప్రతి శాసనసభ నియోజక వర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఈసారి రంగంలోకి దింపాలని ఈసీ నిర్ణయించింది. ఒక్కో స్క్వాడ్‌లో ఒక కార్యనిర్వాహక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, ముగ్గురు పోలీసు అధికారులు ఉంటారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేం దుకు ప్రయత్నిస్తే 18000221952 టోల్ ఫ్రీ నంబ ర్‌కి ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని ఈసీ తెలిపింది. ఫిర్యాదు అందుకున్న 15 నిమిషాల్లోనే ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుంటుందని జిల్లాధికారి శేఖర్ చత్రే చెప్పారు.
 
 ప్రత్యేక నియమ, నిబంధనలు...
 మద్యం విక్రయించే షాపులపై కూడా ఈ స్క్వాడ్ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. మద్యం షాపు యజమానులు ప్రతీరోజు ఏ కంపెనీకి చెందిన మద్యం బాటిళ్లు ఎన్ని విక్రయించారో వాటి వివరా లు కచ్చితంగా నమోదు చేయాలనే ఆంక్షలు విధిం చనుంది. ఇదిలాఉండగా ఎన్నికల ప్రచారం సమయంలో అభ్యర్థి వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉంచుకోరాదు. ఈ సమయంలో భారీ లావాదేవీలు నిర్వహించాలంటే అందుకు చెక్కులు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతులను వినియోగించాల్సి ఉంటుంది. సరాసరి రోజుకు 10 లక్షలకుపైగా ఖర్చుచేస్తే ఇబ్బందుల్లో పడతారు. అభ్యర్థులు బ్యాంక్ నుంచి ఎన్ని డబ్బులు డ్రా చేశారు, ఎంత మేర జమ చేశారు? తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు  జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని ఆయా బ్యాంక్‌లకు కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయనుంది. దీంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంతమేర లావాదేవీలు నిర్వహించారు, ఎంతమేర ఖర్చు చేశారో వివరాలు తెలిసే అవకాశముందని శేఖర్ చత్రే అభిప్రాయపడ్డారు.   
 

>
మరిన్ని వార్తలు