ఆన్‌లైన్‌ పాలన

18 Oct, 2016 16:28 IST|Sakshi
‘పాలన పారదర్శకంగా ఉండాలి..  ప్రజలకు అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి.. నిబంధనలకు లోబడి ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయాలి. ఒకవేళ కాకపోతే కారణం చెప్పాలి.. అంతే కానీ కాలయాపన చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దు.. కొత్త జిల్లాలో పాలనలో మార్పు రావాలి.. అందుకోసం ఆన్‌లైన్‌ పాలన ఫలితాలను ఇస్తుంది’  అని కలెక్టర్‌ సురేంద్ర మోహన్‌ అధికారులకు సోమవారం కంప్యూటర్‌ పాఠాలు చెప్పారు.
 
‘సాక్షి’ సూర్యాపేట : భవిష్యత్‌లో ఆన్‌లైన్‌పాలన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతీ ఫైలును ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను స్కానింగ్‌ చేయడమే గాక కొత్తగా వచ్చే వాటిని ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తారు. ఇక కార్యాలయాలకు వచ్చిన  ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా జాగ్రత్తగా పొందు పర్చనున్నారు. అదేవిధంగా కిందిస్థాయి కార్యాలయాలు, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఫైళ్లను కూడా కంప్యూటర్స్‌లో ఫీడ్‌ చేయనున్నారు. దరఖాస్తుతో పాటు ఇచ్చిన సెల్‌నంబర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదు కాగానే సదరు దరఖాస్తు దారుడికి రెఫరెన్స్‌ నంబర్‌ను సెల్‌ మెస్సేజ్‌ ద్వారా పంపిస్తారు. దీంతో ప్రజలు తరచు కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ ఇంటి వద్ద కంప్యూటర్‌ లో జిల్లా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసుకొని తమ పని ఎంతవరకు అయింది.. ఏ అధికారివద్ద పెండింగ్‌లో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే తమ సిస్టంకు లాగిన్‌ అయిన దరఖాస్తులు సకాలంలో చూడకుండా జాప్యం చేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా స్పష్టం అయ్యే అవకాశం ఉందని, అధికారి ఇంటి వద్దనుంచేఫైల్స్‌ క్లియర్‌ చేయడం, ఆన్‌లైన్‌ ద్వారా సంతకాలు చేసేందుకు ప్రతీ అధికారికి డిజిటల్‌ కీ అందిస్తారు. దీంతో ఎంత రాత్రైనా ఇంటి వద్దనే ఉండి పని ముగించుకునే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండటంతోపాటు.. అధికారులకు విధుల పట్ల అంకిత భావంతో పనిచేసే అవకాశం ఉంది అంటారు జిల్లా కలెక్టర్‌ సురేంద్ర మోహన్‌.
 
జనవరి నుంచి..
ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ, ప్రజలసమస్యల పరిష్కారం ప్రక్రియను జిల్లాలో అమలు చేయడం కష్టమేమీ కాదని కలెక్టర్‌ జిల్లా అధికారులకు చెప్పారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ ఐటీ  నిపుణులతో ఆన్‌లైన్‌ పాలనపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన కంప్యూటర్లు, స్కానర్ల కొనుగోలుకు త్వరలో నిధులు సేకరిస్తామని, ఆ వెంటనే వచ్చే జనవరి నాటినుంచి కొత్తసంవత్సరంలో కొత్తగా ఆన్‌లైన్‌ పాలన ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ముందుగా జిల్లా కార్యాలయాల నుంచి ఈ విధానం అమలు చేస్తామని, సంవత్సరం కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు పనులు వేగవంతంచేస్తామని కలెక్టర్‌ వివరించారు. అయితే అధికారులకు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చేందుకు ముందుగా విడతల వారీగా జీహెచ్‌ఎంసీలో పనితీరును పరిశీలించేందుకు పంపిస్తామని, ఆ తర్వాత జిల్లాలో కంప్యూటర్‌ శిక్షణకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  
మరిన్ని వార్తలు