ఈశాన్యవాసుల క్షేమమే పార్లమెంట్ కాంక్ష

6 Feb, 2014 00:03 IST|Sakshi
ఈశాన్యవాసుల క్షేమమే పార్లమెంట్ కాంక్ష
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తానియా హత్యను లోక్‌సభ బుధవారం ఖండించింది. యువకుని మరణాన్ని యావత్ భారతదేశం ఖండిస్తోందని, ఈశాన్య ప్రాంతవాసులను రక్షించాలని పార్లమెంటు ఆకాంక్షిస్తోందన్న విస్పష్ట సందేశం  దేశ ప్రజల్లోకి వెళ్లాలని స్పీకర్ మీరా కుమార్ చెప్పారు. 
సిగ్గుచేటు ఘటన: సుష్మాస్వరాజ్‌నిడో హత్య అంశాన్ని  జీరో అవర్‌లో లేవనెత్తిన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ఈ ఘటనను సిగ్గుచేటుగా అభివర్ణించారు. నిడో మరణంతోపాటు ఇద్దరు మణిపురి యువతుల వేధింపుల ఘటననూ ఆమె సభలో ప్రస్తావించారు.  
 
ఈశాన్య ప్రాంతవాసులపట్ల  వివక్షను రూపుమాపాలని ఆమె కోరారు. ఢిల్లీవాసులు దేశంలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈశాన్య ప్రాంతాల విద్యార్థుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈశాన్య ప్రాంతవాసులను రక్షించవలసిన కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు ధర్నాలు చేస్తూ కూర్చుంటున్నాయని పరోక్షంగా కేజ్రీవాల్‌ను విమర్శించారు.  ఈశాన్య ప్రాంత విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల వారితో కలిసి నివసించేందుకు వీలుగా హాస్టల్స్  నిర్మించాలని డిమాండ్ చేశారు. 
 
చర్యలకు వామపక్షాల డిమాండ్...
వామపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తి  నేరస్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ప్రాంతవాసుల పట్ల జాతివివక్షను ఆపండి అని రాసిఉన్న పోస్టర్‌ను వారు ప్రదర్శించారు. ఈశాన్య ప్రాంత విద్యార్థుల పట్ల జాతి వివక్ష తీవ్రమైన అంశమని, దానిని రూపుమాపాలని మైనారిటీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నినాంగ్ ఎరింగ్ అన్నారు. నీడో  మరణాన్ని  రాజకీయం చేయవద్దని కోరారు. ఇటువంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు కఠిన చట్టం తేవాలని ఆయన కోరారు. జేడీయూ నేత శరద్ యాదవ్ ఈ అంశంపై మాట్లాడుతూ... ఇది దేశ ఐక్యతకు సంబంధించిన  విషయమని, ఎవరికీ అన్యాయం  జరగకూడదని అన్నారు.  నిడోను చంపిన నిందితులెవరో ఇప్పటికీ పోలీసులు గుర్తించలేదని సభ దృష్టికి తెచ్చారు. 
 
తాజా నివేదికివ్వండి: హైకోర్టు
నగరంలో నిడో తానియా మరణంపై తనంతటతానుగా విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు... ఢిల్లీ పోలీసులు సమర్పించిన నివేదికను బుధవారం తోసిపుచ్చింది. మృతుడి పోస్ట్‌మార్టమ్‌కు సంబంధించిన అన్ని వివరాలతోపాటు తాజా నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. నత్తనడకన దర్యాప్తు జరుపుతున్న తీరును న్యాయస్థానం తప్పుపట్టింది.
 
ఐదుగురు సభ్యులతో కమిటీ..
నగరంలో ఈశాన్య వాసుల సమస్యలను పరిశీలించడం కోసం హోం మంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. నిడో మరణంపై న్యాయ దర్యాప్తుకు కూడా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
 
మరిన్ని వార్తలు