శశికళ ప్రమాణంపై అదే ఉత్కంఠ

8 Feb, 2017 07:22 IST|Sakshi
శశికళ ప్రమాణంపై అదే ఉత్కంఠ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే ఆమె చేత ప్రమాణం స్వీకారం చేయించాల్సిన ఇన్‌చార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు చెన్నై రాకపై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ శశికళపై పూటపూటకూ వ్యతిరేకత పెరుగుతోంది. ముంబై నుంచి గవర్నర్‌ చెన్నై వెళ్లడంపై బుధవారం నిర్ణయం తీసుకోవచ్చని మహారాష్ట్ర రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్‌ ఇప్పట్లో చెన్నైకి రాకపోవచ్చని తమిళనాడు రాజ్‌భవన్‌ వర్గాల సమాచారం. ఇక సొంత పార్టీకి చెందిన అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పాండ్యన్‌.. జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

జయను ఆస్పత్రిలో చేర్చిన రోజు ఆమెతో శశికళ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారని, ఆ సందర్భంలో గెంటివేయడంతో కిందపడిపోయారని చెప్పారు. ఆరోజు జరిగిన ఘటనపై విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక ఏఐఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప.. జయ మరణంపై జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌ చేశారు. కాగా, శశికళ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిల్‌లో లోపాలు ఉన్నందున మంగళవారం విచారణకు నోచుకోలేదు. మద్రాస్‌ హైకోర్టులో కూడా శశికళకు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

మరిన్ని వార్తలు