సాక్షి, ముంబై: గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్‌రావును తోపులాటకు ఘటనలో సస్పెండైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు ఊరల లభించింది. వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ హరీభావ్ బాగ్డే మంగళవారం ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నవంబరు 12వ తేదీన జరిగిన మొదటిరోజు సమావేశానికి హాజరయ్యేందుకు గవర్నర్ వచ్చారు.
అక్కడే అసెంబ్లీ హాలు మెట్లపై కూర్చున్న కొందరు శివసేన ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావ్...చలే జావ్ అంటూ గట్టిగా నినదిం చారు. మరికొందరు ఆయన కారును అడ్డుకున్నారు. ఎట్టకేలకు కారు దిగి లోపలికి వస్తుండగా గవర్నర్‌ను కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చుట్టుముట్టడంతో అది తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలోఆయన చేతికి స్వల్ప గాయమైంది.
ఈ ఘటనకు బాధ్యులైన వీరేంద్ర జగ్తాప్, రాహుల్ బోంద్రే, జైకుమార్ గోరే, అబ్దుల్ సత్తార్, అమర్ కాళేలపై అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం జరిగిన సమావేశంలో వారిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కొందరు కాంగ్రెస్ సభ్యులు బాగ్డేను కోరారు. అందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
శాసనసభలో ప్రతిపక్ష నేతగా రాధాకృష్ణ
సాక్షి, ముంబై: శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రాధాకృష్ణ విఖే పాటిల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నాగపూర్‌లో శాసనసభలో మంగళవారం స్పీకర్ హరీభావు బాగ్డే ప్రకటించారు. విధానమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్సీపీకి చెందిన ధనంజయ్ ముండే సోమవారం ఎంపికైన విషయం తెలిసిందే. ఎట్టకేలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెం డు వారాలకు ఉభయ సభలకు ప్రతిపక్ష నాయకులు లభించారు. బుధవారం ఈ సమావేశాలు ముగియనున్నాయి.
కాగా ప్రతిపక్ష నాయకుడిగా విఖే పాటిల్ పేరు ప్రకటించగానే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన గ్రూపు నాయకుడు, మంత్రి ఏక్‌నాధ్ షిండే, ఎన్సీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, సీనియర్ నాయకుడు గణపత్రావ్ దేశ్‌ముఖ్ తదితరులు ఆయనను అభినందించారు. ఇదిలాఉండగా ప్రతిపక్ష పదవి కోసం ఎన్సీపీ తరఫున ఆర్.ఆర్.పాటిల్ పేరు సిఫారసు చేశారు. ఈ విషయమై న్యాయసలహా తీసుకున్న స్పీకర్ వెంటనే విఖే పాటిల్ పేరు ఖరారు చేశారు. తరువాత ఆయన పేరు అధికారికంగా ప్రకటించగానే శాసనసభా మందిరం చప్పట్లతో మార్మోగింది.
ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పదవి కీలక మని, దీన్ని విఖే పాటిల్ సమర్ధంగా నిర్వర్తిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి వివాదాలకు తావీయకుండా తాను కూడా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా విఖేపాటిల్ హామీ ఇచ్చారు. కాగా విఖే పాటిల్ పేరు ఖరారు కావడంతో అహ్మద్‌నగర్ జిల్లా నాయకుడికి మరో పదవి దక్కినట్లయింది.