తెలుగు భాష మధురం

17 Aug, 2013 23:59 IST|Sakshi

 కొరుక్కుపేట, న్యూస్‌లైన్: పరభాషీయుల చేత పొగడబడిన మధురమైన భాష మన తెలుగు భాష అని విశ్రాంత తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కాసల నాగభూషణం అభిప్రాయపడ్డారు. శనివారం చెన్నై, పెరంబూర్‌లోని బందర్‌ఆది వెలయ సమూహం వేదికగా శ్రీరాయల కళాసమితి(తెలుగు సాంస్కృతిక సమితి) 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోవిందనామావళితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గిరి కంపెనీ అధినేత మోటుపల్లి డాక్టర్ గిరిహనుమంతరావు అధ్యక్షత వహించారు.
 
  పిళ్లారిశెట్టి ఆదికేశవరావు స్వాగతం పలికారు. చెన్నై, రెప్కో బ్యాంకు జనరల్ మేనేజర్ వంజరపు శివయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ కాసల నాగభూషణం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సంస్కృతికి ఆయుపట్టు భాష అని  కొనియాడారు. అనంతరం గిరి హనుమంతరావు మాట్లాడారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ రాయలు పేరు మోసిన రాయలకళా సమితి నిర్వహించిన కార్యక్రమానికి తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరుకాక పోవడం విచారకరమన్నారు. వార్షికోత్సవంలో జీ.గౌరి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, వందన సమర్పణ బాబు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణవి, కాకాణి వీరయ్య, పీ.రమణయ్య తదితర ప్రముఖులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు.

మరిన్ని వార్తలు