సైకో జయ శంకర్ చిక్కాడు

7 Sep, 2013 04:45 IST|Sakshi

ఐదు రోజుల పాటు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సైకో జయ శంకర్ ఎట్టకేలకు చిక్కాడు. ఎక్కడో కాదు పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలోని కూడ్లు చెరువు పక్కనే ఉన్న ఓ చిన్న గుడిసెలో ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
 
బెంగళూరు, న్యూస్‌లైన్ : పలు కేసుల్లో సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవిస్తూ తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ అలియాస్ శంకర్‌ను ఓ ఫోన్ కాల్ పట్టిచ్చింది. దీంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు-హొసూరు రోడ్డులోని కూడ్లు గేట్ సమీపంలో చెరువు దగ్గర ఉన్న చిన్న గుడిసెలో అతనిని శుక్రవారం ఉదయం 10.45 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ రహస్య ప్రాంతానికి తరలించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ మాట్లాడుతూ... ‘తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన జయ శంకర్ మీద ఆ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో అనేక హత్యలు, లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి.

అంతకు ముందు డ్రైవర్‌గా పని చేసే వాడు. ఈ నెల 1న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. బెంగళూరు నగర, బెంగళూరు సీసీబీ, చిత్రదుర్గ, శిర, బిజాపురలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఐదు ప్రత్యేకృబందాలు ఇతని కోసం గాలించాయి. ఇతని ఆచూకీ కోసం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పది వేల పోస్టర్లను అతికించారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళం భాషలలో 75 వేల కరపత్రాలు ముద్రించి పంచి పెట్టారు. ఎట్టకేలకు కూడ్లు గేట్ వద్ద పట్టుబడ్డాడు’ అని వివరించారు. జయ శంకర్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపారు.

జైలు నుంచి అతను 30 అడుగుల గోడ దూకడానికి గ్లౌజ్‌లు, దుప్పటి ఉపయోగించాడని చెప్పారు. జయశంకర్ తప్పించుకోవడానికి ఎవరు సహకరించారని అడిగినప్పుడు, దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇన్‌ఫార్మర్ పేరు చెప్పడానికి నిరాకరించారు. ఇన్‌ఫార్మర్‌కు తాము ఒక మొబైల్ ఇచ్చామని చెప్పారు. జయ శంకర్ నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, అదే రోజు జైలులోని గార్డెన్‌లో ఆ తాళం చిక్కిందని వివరించారు. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. శంకర్ పోలీసు దుస్తులలో పారిపోలేదని, నైట్ డ్రెస్‌లో తప్పించుకున్నాడని తెలిపారు. అదే డ్రెస్‌తో శుక్రవారం పట్టుబడ్డారని అన్నారు.

 పోలీసులకు అభినందనలు.... మంత్రి జార్జ్

 బెంగళూరు పోలీసులు సమర్థంగా పని చేశారని, అందువల్లే శంకర్ చిక్కాడని హోం మంత్రి జార్జ్ తెలిపారు.  శంకర్ తప్పించుకోవడానికి జైలు సిబ్బంది సహకరించారని వెలుగు చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు అందిస్తామని తెలిపారు.

  రూ.100 ఇచ్చి నీరు, భోజనం కావాలన్నాడు:  నరేంద్ర

 పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలో కూడ్లు చెరువు ఉంది. కూడ్లు గేట్ కూడా సమీపంలోనే ఉంది. చేపలు పట్టేవారు చెరువు పక్కన చిన్న గుడిసె వేసుకున్నారు. చేపలు తగ్గిపోవడంతో  ఆరు నెలల నుంచి ఆ గుడిసెలో ఎవరూ ఉండడం లేదు. గుడిసెకు కనీసం తలుపులేదు. శుక్రవారం ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న నరేంద్ర, బాబు తదితరులు అటువైపు వెళ్లారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న శంకర్ తాగడానికి నీళ్లు కావాలని, ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేశాడు.

అక్కడికెళ్లి ఇక్కడెందుకున్నావని వారు ప్రశ్నించగా, తాను తమిళనాడుకు చెందిన డ్రైవర్‌నని, ప్రమాదం జరగడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తప్పించుకుని వచ్చానని చెప్పాడు. కాళ్లు, చేతులకు గాయాలుండడంతో వారూ నిజమనుకున్నారు. వారికి రూ.100 నోటు ఇచ్చి భోజనం తెచ్చివ్వాలని కోరాడు. అదే సమయంలో బనశంకరిలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేయాలనడంతో బాబు అతనికి మొబైల్ ఇచ్చాడు. తర్వాత బాబు భోజనం తీసుకురావడానికి వెళ్లాడు. ఐదే నిమిషాల్లో పోలీసులు వచ్చి గుడిసెలోకి చొరబడిఅతని కాళ్లు, చేతులు కట్టి వేశారని నరేంద్ర మీడియాకు చెప్పాడు. తరువాత అతను సైకో శంకర్ అని తమకు తెలిసిందన్నాడు. ఆరు జీపులలో పోలీసులు వచ్చి శంకర్‌ను తీసుకు వెళ్లారని నరేంద్ర వివరించాడు.  
 

మరిన్ని వార్తలు