మిమ్మల్ని చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తోంది

31 Jan, 2019 11:48 IST|Sakshi
రోదిస్తూ రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ గీత

రైతుల దుస్థితి చూసి కన్నీటిపర్యంతమైన తహసీల్దార్‌

కర్ణాటక,మండ్య: బకాయిలు చెల్లించాలని నిరసన చేస్తున్న రైతులతో చర్చించడానికి వచ్చిన మహిళ తహశీల్దార్‌ రైతులు దుస్థితిని చూసి చలించిపోయి కన్నీటి పర్యంతమయ్యారు. బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని చాంషుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట చెరకు రైతులు నిరసనలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ గీతా వెంటనే అక్కడికి చేరుకొని రైతుల సమస్యలు ఆలకించిన అనంతరం మాట్లాడారు. గతంలో తాము కోలారు జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కరువు కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.

మండ్య జిల్లాలో నీటి సమస్య ఉండదని వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు కావేరి నదీ తీరాన ఉండడం వల్ల మండ్య జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లదంటూ కోలారు జిల్లా ప్రజలు తమకు చెప్పేవారన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన అనంతరం కోలారు జిల్లాలో పరిస్థితులే మండ్య జిల్లాలో కూడా కనిపిస్తున్నాయని ఇక్కడి రైతులు కూడా అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండడం తమను తీవ్రంగా కలచివేస్తోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తాము కూడా రైతు కుటుంబం నుంచే వచ్చామని రైతుల కష్టాలు తమకు కూడా పరిచయమేనని అందుకే చెరకు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా బకాయిలు విడుదల చేయాలంటూ ఫ్యాక్టరీ ఉపాధ్యక్షులకు సూచించామన్నారు.

దీంతోపాటు చక్కెర ఫ్యాక్టరీ యజమాన్యం చెబుతున్న కారణాలతో పాటు రైతుల డిమాండ్లు, పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదికలు అందిస్తామని అనంతరం కలెక్టర్‌ సూచన మేరకు చర్యలు తీసుకుంటామని చెరకు రైతులకు న్యాయం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు