దేశంలోనే పొడగరి..జీవితం ఎలామరి? 

17 Jul, 2018 02:15 IST|Sakshi

యశవంతపుర: ఇతడి పేరు మారుతీ హనుమంత్‌... అయితే ఏమిటీ విశేషం అని అడగొచ్చు. ఇతని ఎత్తు 7 అడుగుల 9 అంగుళాలు. వయసు 36 ఏళ్లు. ఊరు కర్ణాటకలోని బీదర్‌ జిల్లా ఔరాద్‌ తాలూకా చింతాకి గ్రామం. భారతదేశంలోనే ఎత్తైన వ్యక్తిగా రికార్డ్‌ సృష్టించాడు. మారుతీని చూసిన కొత్తవారు అతడితో ఫోటోలు తీయించుకొని మురిసిపోతున్నారు. సాధారణ వ్యక్తి అతడి ముందు నిలుచుంటే మరుగుజ్జు అయిపోతాడు. మారుతి ఎత్తు ఎక్కువే అయినా, కుటుంబం మాత్రం నిరుపేదది. తల్లీ వీరవ్వ, ముగ్గురు సోదరులు రోజూ కష్టపడి కూలీ చేసి సంపాదిస్తేగానీ మారుతీకి పూటగడవటం కష్టం.

నడుం వంచి పని చేయలేడనే నెపంతో గ్రామంలోనివారు ఎవరూ మారుతీని పనికి పిలవటం లేదు. నడిచేటప్పుడు భూమికి రాసుకుని రెండు కాళ్లకు పుండు కావటంతో నడవటం కూడా అతడికి కష్టంగా మారింది. ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో రూ. వెయ్యి పెన్షన్‌ అందిస్తోంది.  ఒక్క సెంట్‌ కూడా భూమి లేకపోవటంతో భవిష్యత్తు మీద బెంగ పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలని కోరికగా ఉన్నా ‘తగిన’సంబంధాలు దొరకటంలేదు. ప్రభుత్వం ఇచ్చిన పక్కా ఇల్లే ఆశ్రయం. ఇంత ఎత్తు ఉన్నా దానివల్ల తనకు, కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదని మారుతి, సోదరులు, తల్లి ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మారుతీ తల్లి ప్రభుత్వాన్ని కోరారు.  

మరిన్ని వార్తలు