లండన్‌లో బస్సు ప్రమాదం

29 Aug, 2017 10:06 IST|Sakshi
లండన్‌లో బస్సు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం
లండన్‌లో కంచి వ్యక్తులు మృతి
మృతదేహాల రాకలో జాప్యం


లండన్‌లో శనివారం జరిగిన బస్సు  ప్రమాదంలో కాంచీపురం పిల్లైయార్‌ పాళయం మండపం వీధికి చెందిన పన్నీర్‌ సెల్వం (63), అతని చెల్లెలు తమిళమణి, ఆమె భర్త అరుళ్‌ సెల్వం సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ సంఘటనతో కాంచీపురం పిల్లయార్‌ పాళయంలో విషాదం నెలకొంది.

కేకే.నగర్‌: విహారయాత్ర నిమిత్తం లండన్‌కు వెళ్లిన ముగ్గురు అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వరుసగా రెండు రోజుల సెలవుల కారణంగా మృతదేహాలను తెప్పించడంతో తీవ్ర జాప్యం నెలకొనడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లండన్‌ బకింగ్‌హామ్‌ షయర్‌ ప్రాంతంలో శని వారం ఉదయం మినీ బస్సును రెండు కంటైనర్‌ లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న కాంచీపురం పిల్లైయార్‌ పాళయం మండపం వీధికి చెందిన పన్నీర్‌ సెల్వం(63), అతని చెల్లెలు తమిళమణి, ఆమె భర్త అరుళ్‌ సెల్వం, కుంభకోణానికి చెందిన నలుగురు, కేరళకు చెందిన సిరియాక్‌ జోసఫ్‌ సహా ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

పన్నీర్‌ సెల్వం కుమారుడు మనో రంజితం లండన్‌లో గల ప్రైవేటు ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. అతని ఇంటికి పన్నీర్‌ సెల్వం కుటుంబంతో సహా వెళ్లాడు. విహారయాత్రకు వెళ్లినపుడు ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పన్నీర్‌ సెల్వం భార్య వళ్లి, కుమారుడు మనోరంజితం, అతని భార్య సంగీత తీవ్ర గాయాలతో లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ నేపథ్యంలో మృతదేహాలను కాంచీపురానికి తీసుకురావడానికి శని, ఆది వారాలు దౌత్య కార్యాలయానికి సెలవు కావడంతో ఆలస్యం అవుతోంది. మృతుల బంధువులు సోమవారం ఉదయం కాంచీపురం జిల్లా కలెక్టర్‌ను కలిసి మృతదేహాలను తీసుకురావడంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు