తమిళ ఖైదీల రికార్డు

26 Oct, 2016 20:02 IST|Sakshi
తమిళ ఖైదీల రికార్డు

► ఉత్పత్తుల తయారీ ద్వారా రూ.47.87 కోట్లు సంపాదన

సాక్షి ప్రతినిధి, చెన్నై: రికార్డు సాధనకు జైలు జీవితం ఎంతమాత్రం అడ్డుకాదని నిరూపించారు తమిళనాడులోని ఖైదీలు. తమకు తెలిసిన వృత్తుల ద్వారా ఉత్పత్తులను తయారుచేసి విక్రయించడం ద్వారా 2015లో రూ.47.87 కోట్ల ఆదాయాన్ని సాధించారు. దేశంలోనే అత్యధిక మొత్తంగా రికార్డు సృష్టించారు. అనేక నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు వారివారి పూర్వానుభవాన్నిబట్టి జైల్లో పనులను అప్పగిస్తుంటారు.

దేశంలో మొత్తం 1,401 జైళ్లు ఉండగా 3లక్షల 66వేల 781 మంది ఖైదీలను ఉంచగల వసతి ఉంది. గత ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటి లెక్కల ప్రకారం వాటి సామర్థ్యానికి మించిన ఖైదీలను అంటే 4 లక్షల 19వేల 623 మందిని ఉంచుతున్నట్లు తేలింది. వీరిలో 5,203 మంది మానసిక వికలాంగులు, హత్య కేసుల్లో నేరస్తులు 70,827 మంది ఉన్నారు. 2,08,276 మంది రిమాండు ఖైదీల్లో 80,528 మందికి రాయడం రాదు. అలాగే 16,365 మంది పట్టభద్రులు ఉన్నారు.

2015లో తమిళనాడు జైళ్లలోని ఖైదీలకు చేనేత, చిత్రలేఖనం, తోలు ఉత్పత్తుల తయారీ, బేకరీ ఉత్పత్తుల తయారీ వంటి బాధ్యతలను అప్పగించారు. ఖైదీలతో నడుస్తున్న ఫ్రీడం బజార్ ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలతో రూ.47.87కోట్లు సంపాదించి తమిళ ఖైదీలు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. ఢిల్లీ ఖైదీలు రూ.31 కోట్లతో రెండో స్థానం, కేరళ ఖైదీలు రూ.22.9 కోట్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో (ఎన్‌సీఆర్ బీ) బుధవారం ప్రకటించింది.

మరిన్ని వార్తలు