తమిళ సినిమా తల్లితో సమానం

28 Jun, 2015 03:17 IST|Sakshi
తమిళ సినిమా తల్లితో సమానం

తమిళసినిమా తల్లిలాంటిదని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద పేర్కొన్నారు. తమిళ చిత్రపరిశ్రమలో నినైత్తాలే ఇనిక్కుమ్(తలుచుకుంటేనే మధురం) అనే పాట వింటుంటే కమల్, రజినీలతో పాటు గుర్తుకొచ్చే నటి జయప్రద. అంతగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జయప్రద. తమిళం, తెలుగుభాషల్లో ప్రముఖ నాయికగా వెలుగొంది అటు పిమ్మట బాలీవుడ్ రంగప్రవేశం చేసి అక్కడా టాప్ హీరోయిన్‌గా వెలిగారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజాసేవకు అంకితమైన జయప్రద తాజాగా తన కొడుకు సిద్ధూను హీరోగా పరిచయం చేస్తూ ఉయిరే ఉయిరే అనే చిత్రాన్ని స్టూడియో9 మోషన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. నటి హన్సిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు.
 
  అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర గీతాలను ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్‌సింగ్ సమక్షంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్‌కపూర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని తెలుగు ప్రముఖ నటుడు మోహన్‌బాబు, పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి, నటి రాధిక, శ్రీప్రియలు అందుకున్నారు. చి త్రం ప్రచార చిత్రాన్ని అమర్‌సింగ్ ఆవిష్కరిం చి వేదికపైనున్న వారందరికి అందించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ ఈ వేది కపై దర్శకుడు కె.బాలచందర్ ఉంటే బాగుండేదన్నారు. అయినా ఆయన ఆశీస్సులు తన కొడుక్కి ఉంటాయని భావిస్తున్నానన్నారు. బాలచందర్ తన చేతిని పట్టుకుని సినిమాను నేర్పించారని గుర్తు చేసుకున్నారు.
 
 తన కొడుకు సిద్ధూను తమిళంలో ఎందుకు పరిచయం చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారన్నారు. తమిళసినిమా తనకు కన్నతల్లిలాంటిదని వివరించారు. పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందీ తమిళసినిమానేనన్నారు. అలాంటి ఈ పరిశ్రమలో తన కొడుకు ఎదగాలనే పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర చిత్రాల కంటే ఈ ఉయిరే ఉయిరే చిత్రంలో సిద్ధూ, హన్సికల జంట చూడ ముచ్చటగా, అందంగా ఉన్నారని జయప్రద పేర్కొన్నారు. నటుడు మోహన్‌బాబు, సుబ్బరామిరెడ్డి, రాధిక, శ్రీప్రియ, సుమలత, అమర్‌సింగ్ తదితరులు చిత్ర యూనిట్‌కు శుభాశీస్సులు అందించారు. చివరగా నటుడు అనిల్‌కపూర్ సినిమా ఎంటర్‌టైన్ అంటూ జయప్రద, హన్సిక, రాధిక, సుమలత తదితరులతో సరదాగా స్టెప్స్ వేసి అందర్నీ అలరించారు.
 

మరిన్ని వార్తలు