పళనికే పీఠం

19 Feb, 2017 01:20 IST|Sakshi
పళనికే పీఠం

సీఎంగా రైతు బిడ్డ
చిన్నమ్మ సేనల్లో సంబరాలు
బెల్లం మండి నుంచి సీఎంగా..
నా కొడుకు ప్రజలు మెచ్చే పాలన అందిస్తాడు
సీఎం పళనిస్వామి తల్లి ఆనందం


బలపరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడపాడి కే పళనిస్వామికే సీఎం పీఠాన్ని అప్పగించారు. రైతు బిడ్డగా, బెల్లం మండితో బతుకు జీవన పయనంలో అడుగు పెట్టిన పళనిస్వామి సీఎంగా అవతరించడంతో స్వగ్రామం ఎడపాడిలో సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది. తన కొడుకు ప్రజలు మెచ్చే పాలనను అందిస్తాడని పళనిస్వామి తల్లి తవసాయమ్మాల్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  తమిళనాడుకు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా, బల నిరూపణలో మెజారిటీ నిరూపించుకున్న పళనిస్వామి జీవిత ఇతివృత్తాంతంలోకి వెళ్తే..

సాక్షి, చెన్నై : సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్‌ దంపతుల చిన్న కుమారుడు పళనిస్వామి(63). చదువు మీద మక్కువ ఎక్కువే. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నాలుగు కిలో మీటర్లు రోజు నడక పయనం సాగించారు. ఇక, ఉన్నత చదువుగా ఈరోడ్‌లోని ఓ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్‌ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తన తండ్రి చూపిన మార్గంలో వ్యవసాయంతో పాటు బెల్లం మండితో జీవన పయనాన్ని సాగిం చారు.  దాయాదుల సమరాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగానే ప్రయత్నించి, నెత్తిన కేసుల మోత వేసుకున్నారు. ఆధారాల కరువుతో ఆ కేసుల నుంచి బయట పడ్డారు. భార్య రాధా, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండిని ముందుకు తీసుకెళ్తూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనుల్లో నిమగ్నం అయ్యారు. తన పొలం పక్కనే అప్పటి మంత్రి ఈరోడ్‌ ముత్తు స్వామి పొలం ఉండడంతో  ఆయన అడుగు జాడల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలుత శిలువం పాళయం  గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

సెంగోట్టయన్‌ మద్దతుదారుడిగా : ఎంజీయార్‌ మరణంతో ఆ పార్టీలోచోటు చేసుకున్న పరిణామాలు పళని స్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి. ఈరోడ్, సేలం, నామక్కల్‌ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలక నేతగా ఉన్న సెంగోట్టయన్‌ తీవ్ర మద్దతు దారుడిగా అమ్మ జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్‌ వెన్నంటి నడిచారు. జయలలిత నమ్మిన బంటుల్లో ఒకరిగా రాష్ట్ర రాజకీయాలపై సెంగోట్టయన్‌ దృష్టి పెట్టగా, ఆయన మద్దతు సేలం జిల్లా రాజకీయాల్లో పళనిస్వామి చక్రం తిప్పారు. ఈ సమయంలో అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడం పళని స్వామికి మరింతగా  కలిసి వచ్చింది. సెంగోట్టయన్‌ స్థానాన్ని భర్తీ చేసే రీతిలో అప్పట్లో చిన్నమ్మ శశికళ పావులు కదిపారన్న ప్రచారం ఉంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి.  చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళని స్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం గమనార్హం.

సంబరాల్లో చిన్నమ్మ సేన : బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది.  ఎక్కడికక్కడ బాణసంచా పేల్చుతూ , స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. పుదియ పురట్చి తలైవీ( నవ విప్లవ నాయకీ) చిన్నమ్మ , త్యాగ తలైవీ( త్యాగ నాయకీ) చిన్నమ్మ వర్ధిల్లాలన్న నినాదాన్ని మార్మోగించారు. చిన్నమ్మ శపథం నెరవేరిందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రోడ్ల మీద  ఆనంద తాండవం చేశారు. పళని స్వామి స్వగ్రామం ఎడపాడిలో అయితే, ఆనందానికి అవధులు లేవు. పశ్చిమ తమిళనాడులోని (కొంగు మండలం) ధర్మపురి, కృష్ణగిరి, సేలం, నామక్కల్, తిరుప్పూర్, ఈరోడ్, కోయంబత్తూరుల్లో అయితే, చిన్నమ్మ వర్గీయుల్లో ఆనందం రెట్టింపు అయింది. కొంగు మండలానికి చెందిన రైతు బిడ్డ సీఎం కావడంతో తమ ప్రాంతాలకు మహర్ధశ పట్టినట్టే అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సుపరి పాలన : తన కొడుగు బల పరీక్షలో నెగ్గడంతో పళని స్వామి తల్లి తవసాయమ్మాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఎంజీఆర్, జయలలిత చూసిన మార్గంలో ప్రజలకు మంచి పాలనను అందిస్తాడన్నారు. కష్టపడి పైకి వచ్చాడని, కష్టం అంటే ఏమిటో తెలిసిన వాడు కాబట్టి, ప్రజలు మెచ్చే విధంగా మంచి పనులు తప్పకుండా చేస్తాడని తెలిపారు.

పళని పయనంలో కొన్ని  ఘట్టాలు:
1989లో కోడిపుంజు చిహ్నంతో ఎడపాడి నుంచి  గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు.
1991లో అన్నాడిఎంకే రెండాకుల చిహ్నంతో అదే నియోజకవర్గం నుంచి మరో సారి గెలుపు.
♦  1992 –1996 వరకు ఆవిన్‌ సంస్థ అధ్యక్షుడు.
1996 ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి
♦  1998 లోక్‌ సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నుంచి తొలి సారిగా పార్లమెంట్‌కు ఎన్నిక
1999లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి
1999–2004 వరకు తమిళనాడు సిమెంట్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు
♦  2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి
2011లో అసెంబ్లీ ఎడపాడి నుంచి గెలుపు. తొలి సారిగా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి పదవి. ఒకే నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళని స్వామి కాస్త ఎడపాడి కే పళని స్వామి అయ్యారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు.  ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్‌ల శాఖ కేటాయింపు
2017 ఫిబ్రవరి  14 అన్నాడిఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నిక
♦  2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం.
2017 ఫిబ్రవరి 18 బల పరీక్షలో విజయ కేతనంతో సీఎం పీఠం పదిలం.

మరిన్ని వార్తలు