‘జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదు’

25 Jul, 2018 09:19 IST|Sakshi

చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెగా గుర్తించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి చేస్తున్న వాదనలను తమిళనాడు ప్రభుత్వం తోసిపుచ్చింది. జయలలిత తన జీవితకాలంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని మద్రాస్‌ హైకోర్టుకు తెలిపింది. కేసు విచారణలో భాగంగా మంగళవారం ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారయణ్‌ ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందజేశారు.  అదే విధంగా అమృత, జయలలిత కూతురని చెప్పాడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.  

పిటిషనర్‌ కేవలం ఆస్తి కోసమే ఈ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ఒకవేళ అమృత జయలలిత కూతురు అయితే ఆమెతో ఒక్క ఫొటో కూడా ఎందుకు దిగలేకపోయారో చెప్పాలన్నారు. అమృత ఫిర్యాదులో 1980 తను జన్మించినట్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రాస్తావించారు.  ఆమె పుట్టిన తేదీకి నెల రోజుల ముందు ఓ అవార్డు కార్యక్రమంలో జయలలిత పాల్గొన్న వీడియోలను ఆయన కోర్టుకు అందజేశారు. ఆ వీడియోల్లో జయలలిత గర్భంతో ఉన్నారని అనడానికి ఎటువంటి అనవాళ్లు లేవని కోర్టుకు విన్నవించారు.

అమృత కోరినట్టు డీఎన్‌ఏ టెస్ట్‌ కావాలంటే.. జయలలిత బంధువులు ఉన్నారని ఆయన తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా తను జయలలిత కూతురిని అని నిరూపించుకోవాలంటే ఆమె పార్ధీవదేహాన్ని వెలికితీసి డీఎస్‌ఏ పరీక్షలు నిర్వహించాలని అమృత కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు