వీడని స్నేహితుడి మరణ మిస్టరీ

11 May, 2017 11:23 IST|Sakshi
మంత్రి మెడపై మరో కత్తి, వీడని మరణ మిస్టరీ

చెన్నై: ఐటీ దాడులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ మెడపై ఆయన స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్‌ సుబ్రమణియన్‌ (52) మరణ మిస్టరీ మరో కత్తిలా వేలాడుతోంది. మరణానికి ముందు సుబ్రమణియన్‌కు ఒకే నంబర్‌ నుంచి 20 సార్లు ఫోన్‌ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

నామక్కల్‌ ఉపాధ్యాయ కాలనీకి చెందిన సుబ్రమణియన్‌ మంత్రి విజయభాస్కర్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుడు. ఈ స్నేహంతో మంత్రి ద్వారా అనేక ప్రభుత్వ భవన నిర్మాణాల కాంట్రాక్టులు పొంది కోట్లు గడించాడు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్‌ తరఫున ధన ప్రవాహానికి నేతృత్వం వహించిన మంత్రి విజయభాస్కర్‌ సహా 35 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు.

అదే సమయంలో సుబ్రమణియన్‌ ఇంటిపై కూడా దాడులు చేసి రెండుసార్లు కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. నగదు బట్వాడాలో మంత్రి వెనుక సుబ్రమణియన్‌ ప్రముఖ పాత్ర పోషించినట్లు అనుమానించిన ఐటీ అధికారులు నిజాలు రాబట్టేందుకు గట్టిగా విచారించారు.  ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. తెల్లారితే చెన్నైలోని ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా ముందురోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినా అనేక అనుమానాలు కొనసాగుతున్నాయి.

ఐటీ దాడుల అనంతరం కొన్ని రోజులుగా సుబ్రమణియన్‌ తన సెల్‌ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి గడుపుతున్నారు. అయితే చివరిగా ఆయనకు కొందరు వీఐïపీల నుంచి ఫోన్‌ వచ్చినట్లు తెలుసుకున్నారు. సుబ్రమణియన్‌ మరణానికి ముందు గుర్తుతెలియని వ్యక్తి ఒకే నంబరు నుంచి 20 సార్లు ఫోన్‌ చేసి అతనికి మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా అంతుచిక్కలేదు. ఫోన్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు వీఐపీల జాబితాను సిద్ధం చేశారు.

అలాగే తోటలో కూర్చుని తన స్వహస్తాలో పేజీల ఉత్తరం రాశాడని తోటలోని కూలీలు పోలీసులకు తెలపగా, ఆ ఉత్తరం కనిపించడం లేదు. సుబ్రమణియన్‌ స్వాధీనంలో మంత్రికి సంబంధించినవిగా చెప్పబడుతున్న కొన్ని డాక్యుమెంట్లు మాయమయ్యాయి. ఐటీ అధికారుల ముందు సుబ్రమణియన్‌ వాంగ్మూలం మంత్రి విజయభాస్కర్‌ను ఇరుకున పడేస్తుందనే కారణంతో ఎవరైనా హత్యచేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు