ఆకతాయిల ఆగడాలకు ‘చెప్పు’ దెబ్బ

14 Feb, 2020 11:32 IST|Sakshi
ఎలక్ట్రానిక్‌ పరికరం అమర్చిన పాదరక్షలతో విద్యార్థినుల బృందం

మహిళల పాదరక్షల్లో ఎలక్ట్రానిక్‌ పరికరం

ఆవిష్కరించిన తంజావూరు జిల్లా ఇంజనీరింగ్‌ విద్యార్థినులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మాయి కదా అని హద్దుమీరారో అలారం మోగుతుంది. తాకేందుకు ప్రయత్నించారో షాక్‌ కొడుతుంది. మాన, ప్రాణాలను కాపాడుకునేలా మహిళల పాదరక్షల్లో అమర్చే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థినులు రూపొందించారు. వివరాలు.. తంజావూరుకు చెందిన బీఈ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ పట్టభద్రురాలైన అమృతగణేష్‌ (33) 600కు పైగా పరికరాలను తయారుచేసింది. తంజావూరులోని ఒక ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినులు సంగీత, సౌందర్య, వినోదిని, విద్యార్థి మణికంఠన్‌లు అమృతగణేష్‌తో కలిసి అనేక పరిశోధనలు చేశారు.

వేధింపుల బారినుంచి మహిళలు తమను తాము కాపాడుకునేందుకు వైర్‌లెస్‌ రిసీవర్, బ్యాటరీ, ఎలక్ట్రోడులను వినియోగించి పాదరక్షల్లో ఇమిడేలా ఒక పరికరాన్ని తయారుచేశారు. మహిళలు వేధింపులకు గురికాగానే వారు ధరించిన చెప్పుల్లోని ఆ పరికరం నుంచి వంద మీటర్ల వరకు వినిపించేలా అలారం మోగుతుంది. అంతేగాక ఆ చెప్పును నిందితునికి తాకిస్తే షాక్‌కు గురయ్యేలా తీర్చిదిద్దారు. ఈ పరికరానికి చార్జింగ్‌ చేయాల్సిన పనిలేదు. నడిచేటప్పుడే రీచార్జ్‌ అవుతుంది. ఈ పరికరాన్ని సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్‌లలో కూడా అమర్చుకోవచ్చు. (చదవండి: ఐటీ అధికారుల ముందుకు అర్చన కల్పత్తి)

మరిన్ని వార్తలు