ఇదేం తీరు!

11 Feb, 2017 02:40 IST|Sakshi

► స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి
►  స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం


ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్నది గుర్తుంచుకోండి, స్వతంత్రంగా వ్యవహరించండంటూ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం తీరుపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారని పక్షంలో ఎన్నికల అధికారిని కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు.

సాక్షి, చెన్నై: గత ఏడాది కోర్టు కన్నెర్రతో స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలు పిటిషన్  విచారణ న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, ఎస్‌ఎం.సుబ్రమణ్యం నేతృత్వంలోని బెంచ్‌ విచారిస్తోంది. ఎన్నికల ఆగడం, అప్పీలు పిటిషన్ విచారణతో స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో గత విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ప్రస్తుతం తీసుకున్న చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పిం చాలని న్యాయమూర్తు లు ఆదేశించారు.

ఏప్రిల్‌లోపు ఎన్నికలు నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్లతో ఆ నివేదిక సమర్పించాలని సూచించారు. అయితే, ఏప్రిల్‌లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని పేర్కొంటూ, ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ వివరాలతో కూడిన నివేదిక కోర్టు ముందుకు గత వారం చేరింది. నివేదిక పరిశీలనానంతరం శుక్రవారం మళ్లీ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎన్నికల నిర్వహణకు తగ్గట్టు ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు ఇంత వరకు తీసుకోకపోవడంపై హైకోర్టు బెంచ్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

స్వతంత్ర సంస్థ:
న్యాయమూర్తులు రామ్మోహన్ రావు, సుబ్రమణ్యం నేతృత్వంలోని బెం చ్‌ ఉదయం విచారణను చేపట్టగా, డీఎంకే తరఫు న్యాయవాది విల్సన్  హాజరై వాదనల్ని వినిపించారు. ఎన్నికల నిర్వహణకు ఇంత వరకు ఎలాంటిచర్యలు తీసుకోలేదని బెంచ్‌ ముందు ఉంచారు. ఈసందర్భంగా ఎన్నికల యంత్రాంగం తరఫు న్యాయవాది పి కుమార్‌ తన వాదనల్ని వినిపించారు. అన్ని ఏర్పాట్లకు తాము సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు కొన్ని రకాల అనుమతులు, ఉత్తర్వులు రావాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకుగాను మరింత సమయం తమకు కేటాయించాలని కోరారు.  దీంతో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు.

ఎన్నికల యంత్రాంగం స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ అనుమతి, ఉత్తర్వులు అని జాప్యం చేయడం మంచి పద్ధతి కాదు అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వరకు కనీస ఏర్పాట్లుకూడా చేయకపోవడం శోచనీయమని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి మారని పక్షంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని కోర్టుమెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా వేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో సాగుతున్న అలసత్వంపై కోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం బట్టి చూస్తే, రాష్ట్రంలో పరిపాలన ఏ మేరకు సంక్షోభంలో ఉన్నదో స్పష్టం అవుతోందని డీఎంకే కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శించారు. 

మరిన్ని వార్తలు