తమిళనాడు ‘అమ్మ’ తరహా చౌక క్యాంటిన్లు

27 Apr, 2014 02:38 IST|Sakshi
  • సర్కార్ యోచన..
  • తక్కువ ధరకు ఆహార పదార్థాలు
  • ‘అక్షయ పాత్ర ఫౌండేషన్’తో  సంప్రదింపులు
  • మొదట బెంగళూరులో 15 చోట్ల ఏర్పాటు
  • అనంతరం ఇతర పట్టణాలకు విస్తరణ
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో తక్కువ ధరకు ఆహార పదార్థాలను అందించే క్యాంటీన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తమిళనాట బహుళ ప్రజాదరణ పొందిన అమ్మ క్యాంటిన్ల మాదిరే వీటిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న ‘అక్షయ పాత్ర ఫౌండేషన్’తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఫౌండేషన్ ఇస్కాన్‌కు చెందినది.

    ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఈ క్యాంటీన్లలో ముందే వండిన ఆహార పదార్థాలను తక్కువ ధరకు విక్రయిస్తారు. తొలుత నగరంలో 15 చోట్ల ఈ క్యాంటిన్లను ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటిల్లో ఎదురయ్యే అనుభవాలతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో విస్తరించాలన్నది ప్రభుత్వ యోచన. ముందుగా ప్రభుత్వాస్పత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో ఈ క్యాంటిన్లను ఏర్పాటు చేస్తారు. రోజూ పెద్ద సంఖ్యలో జనం వచ్చి పోయే చోట్ల వీటిని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ యోచన.

    రెండు నెలల కిందటే ప్రభుత్వం ఇలాంటి క్యాంటిన్లను ఏర్పాటు చేయడానికి నడుం బిగించినా ఎన్నికల నియమావళి అడ్డు పడింది. వండిన ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో అక్షయ ఫౌండేషన్ అపార అనుభవాన్ని గడించినందున, ఈ పథకానికి ఆ సంస్థ సహకారం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లోని 10,631 పాఠశాలల్లో సుమారు 14 లక్షల మంది పిల్లలకు అక్షయ ఫౌండేషన్ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది.

    ఈ ఫౌండేషన్‌తో జట్టు కడితే పరిశుభ్రమైన ఆహారంతో పాటు తక్కువ ధరకే పేదలకు లభిస్తుందనేది ప్రభుత్వ విశ్వాసం. కాగా నగరంలోని కళాసిపాళ్యలో అన్నా డీఎంకే నాయకుడు కేఆర్.కృష్ణ రాజు ఇదివరకే అమ్మ క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నారు. ఆదివారాల్లో మాత్రమే తెరిచే ఈ క్యాంటిన్‌లో ఇడ్లీని రూపాయికే విక్రయిస్తారు. రైస్ ఐటెమ్స్ ధర రూ.3 నుంచి రూ.5 వరకు ఉంటుంది.
     

>
మరిన్ని వార్తలు