పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్కాట్‌!

2 Mar, 2017 00:57 IST|Sakshi
పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్కాట్‌!

చెన్నై:  బహుళజాతి సంస్థలు తయారు చేసిన శీతల పానీయాలపై తమిళనాడులో బహిష్కరణ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా పెప్సీ, కోకోకోలా శీతల పానీయాల అమ్మకాలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. స్థానిక శీతల పానీయాలనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రెండు కూల్‌ డ్రింక్స్‌ను బహిష్కరిస్తూ తమిళనాడు వనిగర్‌ సంఘం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయానికి  సానుకూల స్పందన వస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు  ఏఎం విక్రమరాజా తెలిపారు. పానీయాల ప్రభావం గురించి వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.  

పెప్సీ, కోక్‌ పానీయాలు ఆరోగ్యానికి హానికరమని, వాటిలో క్రిమిసంహారకాలు ఉన్నాయన్నారు. అందువల్లే దేశీయం ఉత్పత్తి చేసే పానీయాలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని విక్రమరాజా పేర్కొన్నారు. కాలీ మార్క్‌, బొవాంటో, టోనిరో వంటి స్థానిక పానీయాలు అమ్మకాలు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. దీంతో కోక్.. పెప్సీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో రూ.1,400 కోట్లు నష్టం వాటిల్లినుంది. కాగా జల్లికట్టు విషయంలో తమ సంప్రదాయాల్ని.. సంస్కృతిని దెబ్బ తీసేలా వ్యవహరించిన పెటాకు ఆర్థిక సాయం అందించే పెప్సీ.. కోకోకోలా ఉత్పత్తుల్ని సినిమా థియేటర్లలో అమ్మకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు