అగ్రస్థానంలో తమిళనాడు

3 Aug, 2013 03:20 IST|Sakshi
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తమిళనాడు దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ కితాబిచ్చారు. కర్మాగారాల ఏర్పాటుకు స్థానిక ప్రభుత్వాల సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి : పుదుక్కోట్టై జిల్లా తిరుమయంలో 57 ఎకరాల్లో రూ.600 కోట్లతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) పవర్‌ప్లాంట్ పైపింగ్ యూనిట్ కర్మాగారం నిర్మించారు. దీనిని ప్రధాని మన్మోహన్‌సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. వివిధ రంగాల్లో ముందుకు సాగినప్పుడే సంపూర్ణ ప్రగతిని సాధించినట్లవుతుందని తెలిపారు. ఇటువంటి సాధనకు తమిళనాడు తార్కాణంగా నిలుస్తోందని మెచ్చుకున్నారు. భెల్ వంటి కర్మాగారాలు ఏర్పడాలంటే స్థానిక ప్రభుత్వాల తోడ్పాటు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి సాధనలో భెల్ సంస్థ గణనీయమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 50 శాతం బొగ్గు ద్వారానే లభిస్తోందని చెప్పారు. 13వ పంచవర్ష ప్రణాళికలో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ద్వారా 20 వేల మెగావాట్ల ఉత్పత్తిని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. భావితరాల ఆశలు, ఆశయాలను భెల్ కర్మాగారం తీరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు చిదంబరం, ప్రపుల్ పటేల్, నారాయణస్వామి, నాయకులు పాల్గొన్నారు.
 
 ప్రధానికి ఘన స్వాగతం
 ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.10 గంటలకు తిరుచ్చిరాపల్లికి చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు, భెల్ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్‌లో పుదుక్కోట్టైలోని తిరుమయం చేరుకున్నారు. కార్యక్రమాలను ముగించుకుని మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని ఢిల్లీ వెళ్లిపోయారు.
 
 వేలాది మంది అరెస్ట్
 ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ఎండీఎంకే, తమిళర్ వాళ్లురిమై కట్చి నేతలు, కార్యకర్తలు తిరుచ్చిలో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. కావేరి జల వివాదం, జాలర్లపై శ్రీలంక వేధింపులు, ముల్లైపెరియార్ సమస్యలపై కేంద్రం మెతకవైఖరి అవలంబిస్తోందని వారు ఆరోపించారు. ఈలం తమిళుల ఊచకోతకు కారకుడైన రాజపక్సేకు రాజకీయంగా వెన్నంటి నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులు ప్రధాని గోబ్యాక్ అంటూ తిరుచ్చి విమానాశ్రయం మీదుగా పుదుక్కోట్టై వైపు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. అలాగే కూడంకులం అణువిద్యుత్ వ్యతిరేక ఉద్యమకారులు సైతం నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. ఈ క్రమంలో వేలాది మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
మరిన్ని వార్తలు