తాతయ్యకు టాటా చెప్పేశారు...

19 May, 2016 19:55 IST|Sakshi
తాతయ్యకు టాటా చెప్పేశారు...

చెన్నై: తమిళనాడు ప్రజలు తాతయ్యకు టాటా చెప్పి...అమ్మకు మరోసారి పట్టం కట్టారు. దీంతో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి ఖాయమనే సంప్రదాయాన్ని అన్నాడీఎంకే తిరగరాసింది. సంప్రదాయాన్ని పాటిస్తారని, ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశలు పెట్టుకుంటే డీఎంకేకు భంగపాటే మిగిలింది. ఈసారి తనకు అధికారం ఖాయమని, ఆరోసారి ముఖ్యమంత్రి తానే అవుతానని  కలలు కన్న కురువృద్ధుడు, డీఎంకే చీఫ్ కరుణానిధికి ఘోర పరాభవమే ఎదురైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'కరుణ' చూపకపోవడంతో  డీఎంకే కూటమి పరాజయం పాలైంది. దీంతో ప్రతిపక్ష స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి.

అధికారం మాదే, సందేహమైతే సర్వేలు చూడండి అంటూ డీఎంకే శ్రేణులు ధీమా వ్యక్తం చేసినా ఎగ్జిట్ పోల్స్ ఊదరగొట్టినా... అన్నాడీఎంకే మాత్రం అంత సీన్ లేదని స్పష్టం చేసింది. సూర్యబింబం పూర్తిస్థాయిలో వెలుగులు ప్రసరించలేకపోవడంతో రెండాకుల జోరు కొనసాగింది. సీఎంగా సిక్సర్ కొట్టాలనుకున్న కరుణా నిధి ఆశలు అడియాసలు కాగా తంబీల మనసును చూరగొన్న అమ్మ అందలం ఎక్కేందుకు సిద్ధమైంది. తమిళనాడులో మొత్తం 232 సీట్లకు గానూ జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 134 స్థానాలు దక్కించుకుంది. ఇక డీఎంకే 97, ఇతరులకు ఒక్క స్థానం దక్కింది.

మరిన్ని వార్తలు