టార్గెట్ 150 !

19 Jun, 2016 08:41 IST|Sakshi
టార్గెట్ 150 !

కాంగ్రెస్ రహిత కర్ణాటకనే ధ్యేయం
ఈ రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం
రాష్ట్ర స్థాయి కార్యాచరణ సమావేశంలో బీజేపీ తీర్మానం

 
బెంగళూరు: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణను రూపొందించింది. అధికార పార్టీ కాంగ్రెస్‌ను వేళ్లతో సహా పెకలించి ‘కాంగ్రెస్ ముక్త కర్ణాటక’ లక్ష్యంగా నగరంలో శనివారం కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలను గెలుచుకొని స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని ఈ సమావేశంలో తీర్మానించింది.
 
 మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం నిర్వహించిన మొదటి కార్యాచరణ సమావేశంలో రాష్ట్రంలో బీజేపీని మరింత పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పై చర్చించారు. ఈ కార్యక్రమానికి బి.ఎస్.యడ్యూరప్ప అధ్యక్షత వహించారు. ఇక కాంగ్రెస్ పాలనా వ్యవధి మరో రెండేళ్లలో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.
 
 హోబళి స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విడతల వారీగా సర్కారు వైఫల్యాలపై పోరాటాలు నిర్వహించాలని తీర్మానించారు. ఇదే సందర్భంలో కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, విజయాలను సైతం రాష్ట్రంలోని ప్రతీ గడపకు తీసుకెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయించారు. గతంలో బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, నేతల మధ్య ఏర్పడిన బేధభావాలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరంపై సైతం సమావేశంలో చర్చించినట్లు సమాచారం. తద్వారా తామంతా ఐకమత్యంగా ఉన్నామన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని బీజేపీ నాయకులు తీర్మానించారు.
 
 కార్యక్రమంలో  కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, జీఎం సిద్ధేశ్వర్, పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు, పార్టీ నేతలు జగదీష్ శెట్టర్, శోభాకరంద్లాజే, సి.టి.రవి, అరవింద లింబావళి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ పదాధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు