టాటా ఏస్, లారీ ఢీ

1 Aug, 2014 03:27 IST|Sakshi
  • కూలికి వెళ్తున్న వృద్ధురాలు మృతి
  •   మృతురాలు వైఎస్‌ఆర్ జిల్లా వాసి
  •   20 మంది ప్రవాసాంధ్రులకు తీవ్రగాయాలు
  •    ఏడుగురి పరిస్థితి విషమం
  •   బాధితులు చిత్తూరు, వైఎస్‌ఆర్, అనంత వాసులు
  • యలహంక : కూలీలను తీసుకొని వెళ్తున్న సూపర్ టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మరణించింది. మరో 20 మంది ప్రవాసాంధ్రులు గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది. రాజనకుంట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... బెంగళూరు నగర శివార్లలోని చౌడేశ్వరినగరలో ప్రవాసాంధ్రులు అధికంగా నివాసముంటున్నారు. అందులో చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాలకు చెందిన వారు అధికం. వీరంత కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తారు.

    ఈ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు రాజనకుంటే సమీపంలోని పాలసంద్రలో ఉన్న జామకాయల తోటలలో కాయలు కోడానికి వెళ్తుంటారు. ఎప్పటిలాగే అలాంటి 21 మంది కూలీలతో ఓ సూపర్ టాటా ఏస్ వాహనం గురువారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో బయలుదేరింది.  రాజనకుంటే సమీపంలో ఈ వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.

    ఈ ప్రమాదంలో వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి సమీపంలోని రామనాథపురానికి చెందిన లక్ష్మమ్మ (64) అక్కడికక్కడే మరణించింది. డ్రైవర్‌తో సహా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని యలహంక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఏస్ డ్రైవర్ సాధిక్ బాష, సంధ్య, నారాయణమ్మ, నాగేంద్ర, రామలక్ష్మమ్మ, కుళాయప్ప, కాంతమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సూపర్ టాటా ఏస్ డ్రైవర్ నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్న  పోలీసులు తెలిపారు.
     

మరిన్ని వార్తలు