-

ఎమ్మెల్సీ మీకు.. మేయర్ మాకు

13 Oct, 2016 11:24 IST|Sakshi
ఎమ్మెల్సీ మీకు.. మేయర్ మాకు
  • జీవీఎంసీ మేయర్ పీఠంపై సైకిల్-కమలం పట్టు
  • తమకే ఇవ్వాలని ఎవరికివారుగా పోటీ
  • బరిలో దిగేందుకు బడానేతల వారసులు సిద్ధం
  • తాజాగా టీడీపీ చేతిలో ఎమ్మెల్సీ ఆయుధం
  • దాన్ని ప్రయోగించి బీజేపీకి చెక్ పెట్టాలని ఎత్తుగడ
  • ఎమ్మెల్సీ వారికిచ్చి.. మేయర్ పదవి
  • కొట్టేయాలని ఎత్తుగడ
  •  
    జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో గానీ.. మేయర్ పీఠం విషయంలో మాత్రం ఏడాదిన్నర కాలంగా మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య పీటముడి పడింది.. అదిగో.. ఇదిగో.. అంటూ ఇన్నాళ్లూ ఈ ఎన్నికల విషయంలో కాలయాపన చేస్తూ వస్తున్న సర్కారు.. ఎట్టకేలకు ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండటంతో మేయర్ గిరీ మాదంటే.. మాదని రెండు పార్టీల నేతలు పట్టుదలకు పోతున్నారు..
     

    ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో దీంతో బీజేపీకి చెక్ పెట్టాలని.. టీడీపీ ప్లాన్ వేస్తోంది..మాకిది.. మీకది పద్ధతిలో ఎమ్మెల్సీ పదవిని కమలానికి కట్టబెట్టి.. మేయర్ పదవిని కొట్టేయాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు ఎంత వరకు ఆమోదిస్తారన్నది ప్రశ్నార్థకమే..
     
    సాక్షి, విశాఖపట్నం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో.. జీవీఎంసీ మేయర్ పీఠంపై మిత్రపక్షమైన బీజేపీతో పడిన పీటముడిని విప్పాలని టీడీపీ యత్నిస్తోంది. ఈ రెండు ఎన్నికలు దాదాపు ఒకేసారి జరిగే అవకాశాలుండడంతో అధికార పార్టీ ఈ ఎత్తు వేస్తోంది.
     
    జీవీఎంసీ ఎన్నికల విషయంలో ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇటీవల ఆ దిశగా సన్నాహాలు చేస్తుండటంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. నగర ఓటర్లు మావైపే ఉన్నారు.. మేయర్ పీఠం మాకే ఇవ్వాలని బీజేపీ, కాదు అధికారంలో ఉన్న తమకే ఇవ్వాలని టీడీపీ ఏడాదిన్నరగా పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పైకి చెబుతున్నప్పటికీ ‘మేయర్ పీఠం మాదంటే మాదంటూ’ నేతలు చేస్తున్న  ప్రకటనలతో రెండు పార్టీల కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
     
    తెరపైకి పెద్దల వారసులు
    పీఠం ఎవరిదన్నది తేలకపోయినా ఇరు పార్టీల ముఖ్యనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపావెంకట్‌ను బరిలోకి దింపాలని కొందరు బీజేపీ పెద్దలు భావిస్తుంటే, పార్టీ అవకాశం ఇస్తే తన కుమార్తెను బరిలో నిలపాలని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆశిస్తున్నారు.
     
    ఇక టీడీపీ విషయానికొస్తే తన కోడలైన మంత్రి నారాయణ కుమార్తెను బరిలోకి దింపాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్టు పార్టీలో బలమైన వాదన విన్పిస్తోంది. మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ పెద్దలు ఆ పీఠం మాకిస్తే మూడోవంతు సీట్లతో సరిపెట్టుకుంటామని.. లేకుంటే చెరిసగం సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.
     
    టీడీపీ చేతిలో ఎమ్మెల్సీ ఆస్త్రం
    ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తనకు అనుకూలంగా మలచుకొని బీజేపీ డిమాండ్‌కు చెక్ పెట్టాలని టీడీపీ యోచిస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంవీఎస్ శర్మ పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుండటంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు సన్నాహాలు మొదలయ్యాయి.
     
    ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టడంతో పట్టభద్రుల్లోనే కాదు.. పార్టీల్లో కూడా ఎన్నికల వేడి మొదలైంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని అస్త్రంగా ఉపయోగించి మేయర్ పీఠంపై గురిపెట్టాలని అధికార టీడీపీ చూస్తోంది. ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మేయర్ పీఠాన్ని తమకే ఉంచుకోవాలన్న ఎత్తుగడను టీడీపీ పెద్దలు తెరపైకి తీసుకొచ్చారు.
     
    ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావంతో పట్టభద్రుల్లో బీజేపీకి ఆదరణ ఉన్నందున ఈ స్థానాన్ని కమలం పార్టీకి కేటాయించడమే సమంజసమన్న వాదనను ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి తాము మద్దతు ఇచ్చి గెలిపించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందుకు ప్రతిగా జీవీఎంసీ మేయర్ పీఠం విషయంలో పట్టుపట్టవద్దని కమలనాధులను కోరుతున్నారు. అవసరమైతే డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని కూడా ఆశ చూపుతున్నారు.
     
    బీజేపీ సీనియర్ నేతలైన రామకోటయ్య, పృద్వీరాజ్‌లతో పాటు మరికొంతమంది పట్టభద్రుల స్థానం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు కన్పిస్తోంది. అయితే ఎమ్మెల్సీ కంటే మేయర్ పీఠంపైనే బీజేపీ బడా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ పీఠం దక్కించుకోవాలని ఉన్నత స్థాయిలో పావులు కదుపుతుండటంతో ఇరుపార్టీల మధ్య వేడి పెరిగింది.
     
    బల్క్‌గా ఓటర్ల నమోదు
    ఎమ్మెల్సీ ఎన్నికకు బల్క్‌గా ఓటర్ల నమోదును నిషేధించినట్లు జిల్లా అధికారులు ప్రకటించినా.. సంబంధిత నిబంధనలో ‘ఎనీ ఇన్‌స్టిట్యూషన్ (ఏ సంస్థ తరపునైనా బల్క్‌గా ఓటర్ల నమోదుకు అవకాశం)’ అన్న క్లాజ్‌ను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున పట్టభద్రులను నమోదు చేయించేందుకు మంత్రులిరువురు పావులు కదుపుతున్నారు.
    మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల ద్వారా పెద్ద ఎత్తున ఓటర్ల నమోదుకు తెరతీస్తున్నారు. దీనికి అధికారులు కూడా వంత పలుకుతూ బల్క్ ఓటర్ల నమోదుకు పచ్చజెండా ఊపుతున్నారు.

మరిన్ని వార్తలు