తప్పతాగి టీడీపీ నేత వీరంగం

31 Oct, 2016 12:31 IST|Sakshi
తప్పతాగి టీడీపీ నేత వీరంగం
రాజమహేంద్రవరం: అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడి హల్‌చల్ రాజమండ్రి వాసులకు కంపరం పుట్టిస్తోంది. తప్పతాగి ఓ టీడీపీ నేత  చేసిన వీరంగం పోలీసుల సహనానికి పరీక్షగా మారింది. వివరాలివీ... స్థానిక దానవాయిపేటలో టీడీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వర్రె శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న ఓ షాపు ఉంది. ఆదివారం అర్థరాత్రి తర్వాత కూడా దుకాణం తెరిచే ఉండటంతో పోలీసులు మూసివేయించేందుకు యత్నించారు.
 
ఈ సందర్భంగా దుకాణం యజమాని పోలీసులతో వాదులాటకు దిగాడు. విషయం తెలుసుకున్న వర్రె శ్రీనివాసరావు నా అనుచరులను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ రచ్చ చేశాడు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సదరు నేత వినిపించుకోలేదు. దీంతో అతని అనుచరుడిని పోలీసులు స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న ఆయన పోలీసు జీపు ముందు బైఠాయించి హంగామా సృష్టించాడు. నాది టీడీపీ .. నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ నానా రభస చేశాడు. దీంతో కుటుంబ సభ్యలు ఆయనను వారించి ఇంటికి తీసుకువెళ్లారు. 
 
అయితే తెల్లవారేసరికి సదరు నేత మత్తు దిగిడంతో అడ్డం తిరిగాడు. దుకాణం వద్ద ధర్నాకు కూర్చుని.. అకారణంగా పోలీసులు అరెస్టు చేశారంటూ విమర్శించాడు. పోలీసులు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు దాడికి దిగాడు.  శ్రీనివాసరావు సీనియర్‌ నేత కావడంతో నగరంలో పెద్దఎత్తును తెదేపా నాయకులు, అభిమానులు మద్దతు తెలిపారు. దీంతో నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 

 

మరిన్ని వార్తలు