కమిషనర్‌పై వీరంగం!

11 Oct, 2016 08:17 IST|Sakshi
 • తిట్లపురాణం అందుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు
 • విజయవాడలో రోడ్డెక్కిన ఫుడ్ కోర్టు తరలింపు రగడ
 • ఎదురుతిరిగిన వ్యాపారులు
 • బంగ్లా వద్ద అర్ధరాత్రి హైడ్రామా
 • మనస్తాపానికి గురైన కమిషనర్  
 •  
  విజయవాడ సెంట్రల్ : కృష్ణా రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరుతో విజయవాడ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌కోర్టులను తరలించాలనే ఆలోచనే ఇంతటి వివాదానికి దారితీసింది. అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ బాబు.ఎ, మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్‌కు అప్పగించారు. దీంతో నగరపాలక సంస్థ తరఫున పద్మావతి ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
   
  అయితే ఆశించిన స్థాయిలో షాపింగ్ ఫెస్టివల్ విజయవంతం కాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రోడ్డులో ఉన్న ఫుడ్‌కోర్టును తరలించడంలో కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వ్యాపారులు ఎదురుతిరిగారన్న సమాచారం అందుకున్న కమిషనర్  ఆదివారం అర్ధరాత్రి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఖాళీ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వ్యాపారులు లెక్క చేయలేదు.
   
   దీంతో కమిషనర్‌కు చిర్రెత్తుకొచ్చింది. తినుబండారాల్లో ఫినాయిల్, బ్లీచింగ్ పోయాలంటూ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో వివాదం ముదిరింది. క్షణాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడకు చేరుకున్నారు. దీంతో సీన్ మారిపోయింది. ప్రజాప్రతినిధులే తిట్లపురాణం లంకించుకోవడంతో కమిషనర్ కారెక్కారు. వ్యాపారులు చుట్టిముట్టి ఆందోళనకు దిగడంతో విధిలేని పరిస్థితిలో నడుచుకుంటూ బంగ్లాకు వెళ్లాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు బాబు.ఎకు కమిషనర్ ఫోన్‌ద్వారా వివరించారు. ఆయన అక్కడకు చేరుకొనేలోపే  వ్యాపారుల ఆందోళన బంగ్లాకు చేరింది. కమిషనర్ బయటకు రావాలని ఆందోళనకారులు రెచ్పిపోయారు.
   
   దిమ్మ తిరిగింది  ...
   రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఫుడ్ కోర్టు వివాదం తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగింది. కమిషనర్ బంగ్లా వద్ద ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఆందోళన జరగడం నగరంలో చర్చనీయాంశమైంది. తమతో ఒక్కమాటైనా చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే గద్దె కమిషనర్‌ను గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది.
   
   తిట్టడం, వెంటపడి ఆందోళన చేయడంపై కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కార్పొరేషన్ ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. కృష్ణా రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరుతో నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌కోర్టులను తరలించాలనే ఆలోచనే ఇంతటి వివాదానికి దారితీసింది. పద్మావతి ఘాట్ వద్దకు ఫుడ్‌కోర్టును తరలించాలని చెప్పిన టీడీపీ ప్రజాప్రతినిధులే ఆందోళనకారులకు కొమ్ముకాయడంతో అధికారులకు దిమ్మ తిరిగి నంతపనైంది.  
   

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు