ఆదిలోనే హంసపాదు

10 May, 2015 03:21 IST|Sakshi

 చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కే ప్రయత్నం చేసినట్లుగా తయారైంది తెలుగుదేశం పార్టీ వాలకం. పార్టీని తమిళనాడులో విస్తరించేందుకు శుక్రవారం చెన్నైలో నిర్వహించిన సన్నాహక సమావేశం ఆదిలోనే హంసపాదు అనే విమర్శలకు తావిచ్చింది. ఆంధ్రుల ఆత్మాభిమానం నిలబెట్టాలనే లక్ష్యంతో నటరత్న  ఎన్‌టీ రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారు. రాష్ట్ర చరిత్రలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ అనతికాలంలోనే అందరి అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చింది. తెలుగువారంతా తమ పార్టీ అని భావించేస్థాయికి ఎన్టీఆర్  తీసుకువచ్చారు.
 
 ఎన్‌టీఆర్ చేతి నుంచి బలవంతంగా పార్టీ పగ్గాలు లాక్కున్న చంద్రబాబు తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీని జాతీయపార్టీగా విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తమిళనాడుపై దృష్టి సారించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్ననాటి నుంచి తెలుగువారు తమిళనాడులో స్థిరపడిపోయారు. రాష్ట్రంలో 30 శాతానికి పైగా తెలుగువారున్నట్లు అంచనా. పొరుగు రాష్ట్రాల్లో టీడీపీని బలోపేతం చేసేందుకు తొలి అడుగును తమిళనాడులో వేశారు. తమిళనాడులో భారీఎత్తున సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ప్రాంతీయపార్టీని జాతీయస్థాయి పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు.
 
 ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తమిళనాడులోని తెలుగుదేశం అభిమానులతో సమావేశమై ఇన్‌చార్జ్ పేర్లను ప్రకటించి దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదుతో తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అభిమానులతో శుక్రవారం సన్నాహక సమావేశం అంటూ నిర్వహించారు. తమిళనాడు పరిశీలకులుగా నియమితులైన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో కనీసం 5 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. జాతీయ పార్టీ బీజేపీతో పోల్చుకుంటూ ఒకప్పటికి తమ పార్టీ సైతం కేంద్రంలో అధికారం చేపట్టేస్థాయికి చేరుకోవడం తథ్యమని బీరాలకు పోయారు. ఈనెల 17వ తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అంకితం కావాలని ఉద్బోధించారు.
 
 అసలుకు లేదు ఆహ్వానం ః
 అంతాబాగానే ఉన్నా... పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన వారిని సన్నాహక సమావేశానికి ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది.
 
 టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తరుపున అనేక కార్యక్రమాలు జరిగాయి. ఎంతో కష్టనష్టాల కోర్చి పార్టీని భుజాన వేసుకుని తిరిగినవారున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన చెన్నైకి వచ్చినపుడల్లా నీడలా వెంట తిరిగిన వారు ఉన్నారు. మౌళివాక్కంలో బహుళ అంతస్తుల మేడ కుప్పకూలిన సమయంలో సీఎం హోదాలో చంద్రబాబు పరామర్శకు రాగా ఆరోజు అనధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసిన వారు ఎందరో ఉన్నారు. అయితే పార్టీ సన్నాహక సమావేశానికి వీరెవ్వరికీ ఆహ్వానాలు కాదుకదా కనీసం సమాచారం లేదు. సాక్షాత్తు లోకేష్‌తో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశం అయిన వారు కూడా ముఖం చాటేశారు. తమిళనాడులో అత్యున్నత హోదాపరంగానేకాక కులపరంగా సైతం పెద్ద దిక్కుగా నిలిచే చంద్రబాబు సన్నిహితుడే మీడియాలో వార్త చూసే సన్నాహక సమావేశం గురించి తెలుసుకున్నానని తెలిపారు.
 
 తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంబరపడిపోయిన మరెందరినో సన్నాహక కమిటి నుండి పిలుపు అందలేదు. తమిళనాడులో పార్టీ ఇంకా మొలకెత్తక ముందే ఇన్ని వర్గాలు, విభేదాలు, అవగాహనా లోపాలా అంటూ అదే పార్టీకి చెందిన నేతలు మెటికలు విరిచారు. పార్టీకోసం ఇన్నాళ్లూ ఎవరు పాటుపడ్డారో గుర్తించని స్థితిలో 5 లక్షల సభ్యత్వం ఎలా సాధ్యమని వారు ఎద్దేవా చేశారు. తాము మరుగున పడిపోతామనే భయంతోనే సన్నాహక సమావేశం నిర్వాహకులు తనను ఆహ్వానించలేదని ఒక టీడీపీ ముఖ్యనేత వ్యాఖ్యానించడం గమనార్హం.
 

>
మరిన్ని వార్తలు