టీచర్లూ...స్కూళ్లో సెల్‌ఫోన్లు వాడొద్దు

30 May, 2016 04:20 IST|Sakshi
టీచర్లూ...స్కూళ్లో సెల్‌ఫోన్లు వాడొద్దు

ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
టీనగర్: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కన్నప్పన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సర్క్యులర్ పంపారు. పాఠశాల వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదకరంగా, గాలి, వెలుతురుతో కూడిన తరగతి గదులు, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా టీచర్లు చూడాలని నివేదికలో పేర్కొన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలను గురించి వివరిస్తూ టీచర్, పేరెంట్స్ ఆసోసియేషన్ సహకారంతో ప్రధానోపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టాలని కోరారు.

పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయడంతో పాటు టైం టేబుల్ రూపొందించి క్లాసులు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ పాఠశాలలు తెరవడానికి అరగంట మునుపే చేరుకుని తరగతి గదులు, ప్రాంగణం శుభ్రంగా ఉన్నాయా లేదో పరిశీలించాలన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదుల నుంచి బయటకు వెళ్లకూడదని, వెళ్లాల్సి వస్తే రిజిస్టర్‌లో సంతకం చేయాలని తెలిపారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని, ఎవరైనా వాడితే ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు