నటి జ్యోతిలక్ష్మికి కన్నీటి వీడ్కోలు

9 Aug, 2016 20:31 IST|Sakshi
నాటి మేటి నృత్యతార జ్యోతిలక్ష్మి ఇక లేరు. 68 ఏళ్ల జ్యోతిలక్ష్మి మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని రామరాజ్ వీధిలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఈమె కొన్ని రోజులు అపోలో ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందారు. అనంతరం ఇంట్లోలోనే చికిత్స పొందుతూ వచ్చారు. కేన్సర్ వ్యాధి ముదరడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
 
జ్యోతిలక్ష్మి పూర్వీకం తంజావూరు. తండ్రి పేరు టి.కె.రామరాజన్, తల్లి శాంతవి. వీరికి ఎనిమిది మంది సంతానం. వారిలో ముగ్గురు రాజ్‌కుమార్, టి.ఆర్.బాలసుబ్రమణ్యం, టీఆర్.రవికుమార్ కొడుకులు, జ్యోతిలక్ష్మి, ప్రతిమాదేవి, లక్ష్మీ, లత, జయమాలిని కూతుళ్లు. వీరిలో నటి జ్యోతిలక్ష్మి పెద్ద కూతురు. చిన్న కూతురు నటి జయమాలిని. జ్యోతిలక్ష్మిని మేనత్త ప్రఖ్యాత నటి ధనలక్ష్మి దత్తత తీసుకున్నారు. ప్రముఖ నాట్యాచారులు తంజై రామయ్యదాస్ వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందిన జ్యోతిలక్ష్మి శివాజీగణేశన్ సమక్షంలో భరతనాట్య తెరంగేట్రం చేశారు.
 
1963లో తన మావయ్య టీఆర్.రామన్న దర్శకత్వం వహించిన పెరియ ఇడత్తు పొన్ను చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఇందులో ఎంజీఆర్, సరోజాదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. అదేవిధంగా తెలుగులో జీవనాంశం చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. అలా వరుసగా తమిళం, తెలుగు భాషా చిత్రాలతోపాటు కన్నడం, మలయాళం, హిందీ అంటూ బహుభాషా నటిగా ప్రాచుర్యం పొందారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నర్తకిగా అన్ని రకాల పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు జ్యోతిలక్ష్మి. తెలుగులో మహానటులు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి అగ్రనాయకులతోను, ఆ తర్వాత తరం మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నుంచి నేటి యువ నటుల వరకు నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది.
 
ముగ్గురు ముఖ్యమంత్రులతో..
ఎన్‌టీ.రామారావు, ఎంజీ రామచంద్రన్, జయలలిత ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన చరిత్ర జ్యోతిలక్ష్మిది. 300 చిత్రాలకు పైగా వివిధ రకాల పాత్రలకు వన్నె తెచ్చిన జ్యోతిలక్ష్మి కొంత కాలం బుల్లి తెరపైనా మెరిశారు. పలు టీవీ సీరియళ్లలో నటించారు. బతికున్నంత కాలం నటించాలని కోరుకున్న జ్యోతిలక్ష్మి అదేవిధంగా జీవించారు. తెలుగులో శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన కుబేరులు చివరి చిత్రం కాగా తమిళంలో ఇటీవల యువ సంగీత దర్శకుడు హీరోగా నటించిన త్రిష ఇల్లన్న నయనతార చివరి చిత్రం.
 
మరో మూడు తమిళ చిత్రాల్లో నటించడానికి అంగీకరించారు. ఈ లోగా అనారోగ్యానికి గురై ఈ లోకాన్ని విడిచారు. జ్యోతిలక్ష్మికి భర్త సాయి్రపసాద్, కూతురు జ్యోతిమీనా ఉన్నారు. సాయిప్రసాద్ తెలుగు వారనేది గమనార్హం. ఈయన ప్రముఖ చాయాగ్రాహకుడు దేవరాజ్ సోదరుడు. జ్యోతిలక్ష్మి, సాయిప్రసాద్‌లది ప్రేమవివాహం. జ్యోతిలక్ష్మి మృతికి దక్షిణ భారత సినీ ప్రముఖులు పలువురు నివాళులర్పించారు. ఆమె పార్థివదేహానికి మంగళవారం టి.నగర్ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
 
 
మరిన్ని వార్తలు